ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టుకు జగన్ లేఖ రాశారు. ఈ లేఖను బహిరంగపర్చారు. దీంతో న్యాయవాదుల్లో రెండు వర్గాలుగా మారి లేఖ రాయడం, బహిరంగపర్చడం తప్పేమీ కాదని వాదిస్తుండగా.. ఇలా చేయడం కోర్టును అప్రతిష్టపాలు చేయడమేనని మరికొందరు అంటున్నారు. అయితే ఇలాంటి లేఖలు రాష్ట్రానికి కొత్తేమీ కాదని..ఇలా రాయడం పెద్ద తప్పేమీ కాదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి లేఖలు ఇదివరకు పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా రాశారని అంటున్నారు. అవేంటో చూద్దాం..
Also Read: టీడీపీకి గడ్డుకాలం లోకేశ్‌తోనేనా..?
1961లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కేంద్ర హోం మంత్రి లాల్ బహదూర్‌శాస్త్రికి లేఖ రాశారు. నాటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా కొందరు న్యాయవాదులు ఆయనకు వత్తాసు పలుకుతున్నారని లేఖలో వివరించారు. అలాగే ఇఎం వెంకటేశ్‌ను న్యాయమూర్తిగా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలో చెప్పారు. ఈ లేఖపై కేంద్రం సత్వర జోక్యం చేసుకోవలని వివరించారు. అయితే ఈ లేఖ రహస్యం బయటపెట్టవద్దని ఆయనే కోరడం విశేషం.
2004లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బీఎస్‌ఏ స్వామి పదవీ విరమణ పొందిన తరువాత 2005లో రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు లేఖ రాశారు. రాష్ట్ర హైకోర్టులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటూ ఈ లేఖలో వివరించారు. ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృపాల్‌లు కేంద్ర న్యాయశాఖకు పంపించారు. అయితే ఆ లేఖపై ఎలాంటి స్పందన రాలేదని స్వామి పేర్కొన్నారు.
2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుప్రీం కోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి శైలిపై ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి కేజీ బాలక్రిష్ణన్ నాటి రాష్ట్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ఈ విషయాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్‌రెడ్డి ఒక సందర్భంలో వెల్లడించారు.
Also Read: దుబ్బాక ప్రచారానికి పవన్..? బీజేపీకి లాభిస్తుందా..?
అయితే రాష్ట్ర పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నప్పులు లేఖలు రాయడం పెద్ద విషయం కాదని, సమస్య పరిష్కారానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చని కొందరు సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. రాష్ట్రంలో జగన్ రాసిన లేఖపై కొందరు అనుకూలంగా.. కొందరు ప్రతికూలంగా వాదిస్తున్నా.. ప్రతీ వ్యవస్థకు ప్రత్యేక అధికారం ఉండడం వల్ల ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ అధికారం చెలాయించే హక్కు లేదంటున్నారు. పారదర్శకత కోసం వ్యవస్థలన్నీ కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.