
రాజకీయాల్లో ఏకస్వామ్య వ్యవస్థ వచ్చాక నేతలే దేవుళ్లు అయిపోయారు. ఇప్పుడు దేశంలోని బీజేపీ బలగానికి నరేంద్రమోడీ దేవుడు అయితే.. ప్రాంతీయ పార్టీలకు ఆ పార్టీ అధినేతలే బాసులు. అందుకే వారు రాసింది రాత.. గీసింది గీత.. అయితే కొన్ని హిట్ కావచ్చు.. కొన్ని ఫట్ కావచ్చు. అంతిమంగా వారే రాజులు, మంత్రులు..
ఇప్పుడు ఏపీలో కూడా ఏపీ సీఎం జగన్ ఏరికోరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సచివాలయ వ్యవస్థ’ దేశంలోనే గొప్ప సంస్కరణ మారి గొప్ప పథకంగా పేరు తెచ్చుకుంది.. 2019, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తారు.
కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘సచివాలయ వ్యవస్థ’పై శిక్షణ కూడా ఇచ్చారంటే ఈ పథకం గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాలనను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయికి డైరెక్టుగా అందించే వ్యవస్థ. గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువులుగా సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ఈ పథకంపై దేశవ్యాప్తంగా మేధావులు , రాజకీయ నాయకులు జగన్ పై ప్రశంసలు కురిపించారు.
అందుకే ఈ గొప్ప పథకాన్ని ఏపీలో పండుగలా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా ‘సచివాలయ దినోత్సవం’గా జరుపనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం తీర్మానించింది. అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అసాధారణ విషయం అని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.