
తెలంగాణలో త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆత్మీయ సమావేశాలు అని చెప్పిన షర్మిల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ పెట్టడం ఖాయమని ప్రకటించింది. ఇప్పుడు ఆ పనుల్లో షర్మిల మద్దతుదారులు బిజీగా మారారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు అయిన షర్మిల.. జగన్ తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీ పెడుతున్నారని అనుకుంటున్నా.. ఆ విషయంపై షర్మిల ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అటు జగన్ సైతం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెట్టేముందు జగన్ ఆశీర్వాదం తీసుకుంటుందా..? అన్న చర్చ ఆసక్తిగా మారింది. తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు కోసం షర్మిలకు జగన్ మద్దతు ఇస్తాడా..? లేదా అని అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాజకీయ వేడి సంతరించుకుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్, బీజేపీల గురించి మాట్లాడుకున్న తెలంగాణవాసులు ఇప్పుడు షర్మిల పార్టీపై మాట్లాడుకుంటున్నారు. షర్మిల పార్టీ పెడితే ఏం చేస్తారు..? ఎలా చేస్తారు..? పార్టీతో ముందుకు వెళుతుందా..? లేక మధ్యలోనే టీఆర్ఎస్ లో విలీనం చేస్తుందా..? అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో పార్టీలు ఏర్పడ్డాయి కానీ అవన్నీ ఏదో ఒక పార్టీలో విలీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ కొనసాగిస్తుందా.. లేదా..? అన్న చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధితో పాటు ఆయన అభిమానుల ఆధారంగా ప్రజల్లోకి వెళుతున్న షర్మిలకు కొందరు రాజకీయ ఆశావహులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ఇతర పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్నవారు షర్మిలతో నడిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు షర్మిల పార్టీపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు.
ఇక ఏపీలో అధికారంలో ఉన్న అన్న జగన్ కూడా షర్మిల పార్టీపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. మొన్నటి వరకు షర్మిల పార్టీ గురించి మాట్లాడకుండా కేవలం సమావేశాలతోనే ముందుకు సాగారు. తాజాగా 9 లేదా 10వ తేదీన పార్టీ పేరే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మంలో నిర్వహించే సభలో షర్మిల పార్టీ గురించి ప్రస్తావించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల తన అన్న జగన్ ఆశీర్వాదం తీసుకుంటుందా..? అన్న చర్చ సాగుతుంది. ఒకవేళ ఆశీర్వాదం కోసం జగన్ ను కలిస్తే పరోక్షంగా వైసీపీని తెలంగాణలో విస్తరిస్తున్నట్లు అనుకుంటారు.. జగన్ ను కలువకపోతే విభేదాలే కారణమని చర్చించుకుంటారు.. ఈ నేపథ్యంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.