ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి అప్పటి హీరోలతో ఎలాంటి సమస్యలూ ఉండేవికావు. క్రమశిక్షణకు వాళ్ళు ప్రతిరూపాలు, మంచి తనానికి వాళ్ళు పర్యాయపదాలు. అందుకే వాళ్ళ కెరీర్ మొత్తంలో ఏ దర్శకుడితోనూ వాళ్ళు గొడవ పడిన సందర్భం ఒక్కటీ కూడా లేదు అంటే ఎంత ఆశ్చర్యకరం. షూటింగ్ అంటే మేకప్ తో రెడీ అయి సెట్ కి వచ్చేవారు. ఇప్పుడు సెట్ కి వచ్చి మేకప్ వేసుకోవడానికి గంటలు పాటు సమయాన్ని వృధా చేస్తున్నారు.
సూపర్ కృష్ణ అయితే తన గురించి కంటే ఎక్కువుగా నిర్మాతల గురించి ఆలోచించే వారు. అందుకే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే, నైట్ షూటింగ్స్ కు కూడా ఆయన అభ్యంతరం చెప్పకుండా నిర్మాతకు సహకరించేవారు. ‘అలా కాదు’, ‘ఇలా చెయ్యను’’ అనే మాటలు కృష్ణగారి నోటి వెంట అసలు వచ్చేవే కాదు. దర్శకుడు ఏమి చెబితే, ఆయన అదే చేసేవారు. అలాగే ఏ నిర్మాతైనా ఇబ్బందుల్లో ఉండి…‘సర్, మన సినిమా ఇంకా కొన్ని ఏరియాలు బిజినెస్ కాలేదు, మీ రెమ్యునరేషన్ లోని బ్యాలెన్స్ ఎమౌంట్.. సినిమా రిలీజ్ తరువాత ఇస్తాను సర్’ అని చెప్పేలోపే..
కృష్ణగారు చిన్న చిరునవ్వుతో ‘దానికేముందండీ, మీకు నచ్చినట్టే చేసుకోండి’ అనేవారు. పైగా సినిమా రిలీజ్ కి నిర్మాత ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాడేమో అని గమనించి.. అవసరం అయితే తిరిగి ఆయనే డబ్బులు ఇచ్చేవారు. అంతేగాని, ‘నాకు ఇవ్వాల్సిన డబ్బులకు ఏదన్నా రాసి ఇవ్వండి. కనీసం నాకు రెండు ఏరియాలైనా రాసివ్వండి అంటూ కండీషన్స్ ను ఏనాడూ పెట్టలేదు. అందుకే డబ్బు సమస్య కారణంగా కృష్ణగారి సినిమాలలో ఒక్కటి కూడా ఆగిపోయిన సందర్భాలు లేవు. కృష్ణగారితో సినిమాలు చేసిన నిర్మాతలందరూ లాభపడ్డారు, ఒక్క కృష్ణగారు తప్ప.