దేశంలో కొవిడ్ మారణహోమం సృష్టిస్తుంటే.. కళ్లు మూసుకుపోయిన 90 శాతం మీడియా.. ప్రభుత్వాలకు రక్షణగా నిలబడిందన్న విషయం దేశం మొత్తం చూసింది. అంతర్జాతీయ మీడియా ఎత్తిచూపే వరకూ దేశీయ మీడియా కళ్లు, నోరు అన్నీ మూసుకుందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోందని అంటున్నారు జనం. అది చాలదన్నట్టు.. జనాల్లో భయాలను కలిగించే పుకార్లు ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి లాక్ డౌన్ విధించబోతున్నార హో… అంటూ బుధవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున పుకార్లు ప్రసారం చేశాయి టీవీ ఛానళ్లు! ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది లేదు.. ముఖ్యమంత్రి ప్రకటించింది లేదు.. అసలు అలాంటి ప్రతిపాదన ఉన్నదో లేదో తెలియదుగానీ.. ఏకంగా డేట్ కూడా ప్రకటించేసింది మీడియా.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లాక్ డౌన్ కు సిఫార్సు చేసింది, సీఎం నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. దీంతో.. ప్రజలు నిత్యవాసరాల కోసం ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. లాక్ డౌన్ విధిస్తే.. సరుకులు అందుబాటులో ఉంటాయో లేవోనని జనాలు మార్కెట్లకు ఎగబడ్డారు. ఈ విషయం ప్రభుత్వం వరకూ చేరడంతో.. డీహెచ్ శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. లాక్ డౌన్ అనేది ఒట్టి పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ నుంచి వెళ్లలేదని చెప్పారు.
దీంతో.. మీడియా ఛానళ్లపై జనం మండిపడ్డారు. జనాలు నిత్యవసరాల కోసం పోటెత్తితే.. కొవిడ్ ఎక్కువగా విస్తరిస్తే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న మీడియాను చూసి మండిపడుతున్నారు. ఈ వార్తా సంస్థల బుద్ధి ఇంకా ఎప్పుడు మారుతుందని ప్రశ్నిస్తున్నారు.