https://oktelugu.com/

తెలంగాణ ‘విమోచనం’ ఎలా అయ్యింది?

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు మిన్నంటాయి. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ ప్రజలు మాత్రం తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 11:52 AM IST
    Follow us on

    1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు మిన్నంటాయి. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ ప్రజలు మాత్రం తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.

    Also Read: ఉచిత విద్యుత్‌ పేరిట భారీ దోపిడీ.. లెక్కలన్నీ తీస్తం : బండి

    నాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని ప్రగల్భాలు పలికాడు. అలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోవడం తప్పదని అప్పటి హోంమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపడంతోపాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్ యాక్షన్’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా పాటిస్తారు.

    1911 నుంచి 1948 వరకు 37 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలించిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ఓటమిని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. ‘ఆపరేషన్‌ పోలో’ విజయవంతమైంది. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి సైతం ఆ మూడున్నర దశాబ్దాల నిజాం పరిపాలనే పునాదులు వేసింది. ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి బాటలు పరిచింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా వంటి అనేక రంగాల్లో నిజాం నవాబు సరికొత్త శకానికి నాంది పలికారు. రైళ్లు,రోడ్డు రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ఆ పునాదులపైన మహానగరం విస్తరించుకుంది. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.

    భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబర్‌ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ మేజర్‌ రాజేంద్రసింగ్‌ నేతత్వంలో మేజర్‌ జనరల్‌ జేఏ చౌదరి దీనికి సారథ్యం వహించారు. షోలాపూర్‌ నుంచి బయలుదేరిన సైన్యం నల్‌దుర్గ్‌ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు వచ్చింది. మేజర్‌ జనరల్‌ డీఎస్‌ బ్రార్‌ ముంబై నుంచి, ఆపరేషన్‌న్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఏఏ రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్‌ శివదత్త బేరార్‌ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది.

    1948 సెప్టెంబర్‌ 14వ తేదీన దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్‌ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్‌ 16వ తేదీన రాంసింగ్‌ నేతత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. భారత వైమానిక ఎయిర్‌ మార్షల్‌ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకమైంది. షోలాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు యూనియన్‌న్‌ సైనికులపాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్‌ ఇద్రూస్‌ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు.

    Also Read: కెసిఆర్ గారు, తెలంగాణా విమోచనదినం వద్దా?

    1947 ఆగస్టు15న దేశమంతా స్వతంత్ర జెండాలెగిరితే..హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌ యూనియన్‌లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పావులు కదిపిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏడాది కాలం పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన సాయుధ రైతాంగ గెరిల్లాలను, మరో వైపు సత్యాగ్రహంతో రోడ్డెక్కిన కాంగ్రెస్‌ సమూహాల్ని ఏడాది పాటు నిలువరించగలిగాడు. చివరకు భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు మూడువైపులా చుట్టుముట్టిన సమయంలో నిస్సహాయంగా మిగిలిన నిజాం అప్పటి హోంమంత్రి పటేల్‌ ముందు మోకరిల్లటంతో..ఆజాద్‌ హైదరాబాద్‌ అవతరించింది.

    భారత ప్రభుత్వ సైనిక చర్యతో ‘నిజాం నవాబు పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానం’ దేశంలో విలీనం అయ్యింది. ఆ రోజు సెప్టెంబర్ 17. ఈ విలీన దినాన్ని తెలంగాణలో అధికారికంగా జరపకపోవడం మన దౌర్భగ్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.