తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకున్న ఫలితాలు రాకపోవడంతో సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు.
టీఆర్ఎస్ వరుస పరాజయాల నేపథ్యంలో కేసీఆర్ పార్టీని తిరిగి గాడినపెట్టే పనిలో పడ్డారు. త్వరలోనే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక ఉండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన పోస్టల్ ఓట్లను పరిశీలిస్తే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరుద్యోగులు.. ఉద్యోగులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల వ్యతిరేకత పడకుండా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
గతంలో నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆందోళనలు.. నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోని కేసీఆర్ ఉన్నఫలంగా 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించడం వెనుక దుబ్బాక.. గ్రేటర్ ఫలితాలే కారణమనే టాక్ విన్పిస్తోంది.
సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకోవడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై గూడుకట్టుకున్న వ్యతిరేకతను తగ్గించేలా నోటిఫికేషన్లను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేకులేసింది.
రాబోయే నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. ఎమ్మెల్సీ ఎన్నిక.. కార్పొరేషన్లో ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ కాచుకొని కూర్చుంది. దీంతో కేసీఆర్ ఇన్నాళ్లూ మూలనపడేసిన నోటిఫికేషన్లను ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలోనే త్వరలోనే 50వేల ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉపాధ్యాయ.. పోలీస్ శాఖలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అన్ని వివరాలను సేకరించాలని ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ గానే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
అయితే ఇన్నిరోజులు లేనిది ఉన్నఫలంగా సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లపై మాట్లాడటంతో నిరుద్యోగులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వస్తాయా? వస్తే ఎప్పటిలోగా భర్తీ చేస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!