కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గడువు తీరిన లైసెన్స్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిన సంవత్సరం వరకు లైసెన్స్ ను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం లైసెన్స్ గడువు ముగిసిన నెల తరువాత మాత్రమే జరిమానా లేకుండా లైసెన్స్ ను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది.
కేంద్రం నిబంధనలలో కీలక మార్పులు చేయడంతో వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం వాణిజ్య వాహనాల పర్మిట్ లకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. వాణిజ్య వాహనాల పర్మిట్ లకు గడువును ఏకంగా 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచింది. ఆన్ లైన్ లో లెర్నింగ్ లైసెన్స్ ను పొందే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పిస్తూ ఉండటం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలలో డీలర్ల దగ్గరే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. మార్పులు అవసరం లేని వాహనాల రిజిస్ట్రేషన్ డీలర్ల దగ్గరే జరిగేలా వాహన పోర్టల్ లో మార్పులు చేసినట్టు కేంద్రం తెలిపింది. మార్పులు చేయడానికి అవకాశం ఉన్న వాహనాలను మాత్రం రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని వెల్లడించింది.
అయితే కేంద్రం మార్గదర్శకాల అమలు విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేంద్రం తెచ్చిన మార్పులను అమలు చేయాలా..? వద్దా..? అనేది రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. తెలంగాణ రవాణా శాఖ కేంద్ర మార్గదర్శకాల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.