
తెలంగాణ సీఎం మార్పు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే మొత్తం ప్రక్షాళన అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువ బ్యాచ్ ఆయన మంత్రివర్గంలోకి వస్తుందని అంటున్నారు. అందులో కేటీఆర్ బావ హరీష్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా గాదరి కిషోర్, దాస్యం వినయ్ భాస్కర్ లాంటి ఉద్యమకారులకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే కేటీఆర్ మొదట చేసిన పని తన బావ అయిన హరీష్ రావు ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. హరీష్ రావు కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే మంత్రి హరీష్ రావు కు నంబర్ 2 పొజిషన్ ఇస్తాడని.. డిప్యూటీ సీఎం చేస్తారని.. కీలక శాఖలు కట్టబెడుతారనే ప్రచారం సాగుతోంది.
ఇక బాల్క సుమన్, వినయ్ భాస్కర్, కిషోర్ సహా యువ నేతలకు కీలక శాఖలు ఇచ్చి తెలంగాణలో పాలనను పట్టాలెక్కించి ప్రజలకు చేరువ అయ్యేందుకు కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేశాడని అంటున్నారు.
మొదటి నుంచి కేసీఆర్ బయట పార్టీల నుంచి వచ్చిన నేతలకే అందలం ఎక్కించి ‘బీటీ బ్యాచ్ కు’ మంత్రి పదవులు ఇచ్చాడన్న విమర్శ ఉంది. ఈ క్రమంలోనే కేటీఆర్ సీఎం అయితే తెలంగాణ ఉద్యమకారులకే మంత్రి పదవులు ఇస్తాడనే ప్రచారం సాగుతోంది. దీంతో బయట పార్టీల నుంచి వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, సబితా, సత్యవతి రాథోడ్ సహా ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కవని.. ఈ విషయంలో కేటీఆర్ స్టిక్ట్ గా ముందుకెళుతారనే చర్చ సాగుతోంది. మరి ఇది చర్చకే పరిమితం అవుతుందా? లేదా కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.