
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్పిన్నర్లు తిప్పేశారు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ల స్పిన్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. అక్షర్ పటేల్ 6 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ జట్టు 112 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆనందం ఇంగ్లండ్ కు లేకుండా పోయింది. ఓపెనర్ సిబ్లే తోపాటు తర్వాత వచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో సైతం డకౌట్ అయ్యి వెనుదిరగడంతో ఇంగ్లండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత రూట్ 17, క్రావ్ ల్లే 53 పరుగులతో ఇంగ్లండ్ ను ఆదుకున్నారు. అయితే భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ధాటికి ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
టీ బ్రేక్ కు ముందే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను తర్వాత కూడా భారత బౌలర్లు ఆటాడించారు. 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అందులో 53 పరుగులు ఓపెన్ క్రావ్ లే చేసినవే కావడం గమనార్హం.
100వ టెస్ట్ ఆడుతున్న ఇషాంత్ శర్మ తొలి ఓవర్ లోనే వికెట్ ను తీయడం విశేషం. ఇక అంతకుముందు 1.10 లక్షల మంది పట్టేలా తీర్చిదిద్దిన ప్రపంచంలోనే అతిపెద్ద అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంను రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా కలిసి ప్రారంభించారు. దీనికి దేశ ప్రధాని.. గుజరాత్ కు చెందిన నరేంద్రమోడీ స్టేడియంగా నామకరణం చేశారు. అతిపెద్ద స్టేడియంలో అభిమానుల సమక్షంలో ఈ టెస్ట్ తొలి రోజే మలుపులు తిరిగింది.