
తెలంగాణలో నిన్నా మొన్నటి దాకా సీఎం మార్పు మీద హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఇటీవల సీఎం మార్పుపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో దానికి తెరపడింది. మరో పదేండ్లు తానే సీఎంనంటూ కార్యవర్గం మీటింగ్ వేదికగా ప్రకటించడంతో ఇక సీఎం మార్పు లేదనేది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా కొత్త పార్టీల అంశం తెరపైకి వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త పార్టీలు ఆవిర్భావం కాబోతున్నాయనేది ఆ కథనాల సారాంశం.
ఒకే.. తెలంగాణలో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తున్నాయనే అనుకుందాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీల మనుగడా సాధ్యం అవుతుందా..? ఇప్పటివరకైతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ కేబినెట్ మంత్రి ఈటల రాజేందర్‌లు పార్టీలు పెడుతున్నారంటూ ప్రచారమైతే జరుగుతోంది. వీరి గురించి ఒక్కొక్కరిగా పర్సనల్‌గా పరిశీలించిన వారికి.. పార్టీని నడపడం వీరికి సాధ్యపడే అంశమేనా అనే ప్రశ్న వస్తోంది.
ముందుగా.. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ సీనియర్ల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదు. అంతేకాదు.. పీసీసీ పదవి చేయి దాకా వచ్చినా పలువురు అడ్డుపడుతుండడంతో ఇంకా ఆ పదవి ఆయనను ఊరిస్తూనే ఉంది. అందుకే.. ఆయన కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆయన పార్టీ పెట్టడం వెనుక ఏపీకి చెందిన పెద్ద లీడర్ హస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకే ఆయన స్వయంగా రేవంత్ రెడ్డితో పార్టీ పెట్టిస్తున్నారని అంటున్నారు. అధికారంలోకి రాకపోయినా.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి కీ రోల్ ప్లే చేయాలని ఆయన ఉద్దేశమట. కనీసం 30 నుంచి 40 వరకైనా సీట్లు రాకపోతాయా అన్న ధీమాతో ఉన్నారట. అందుకే.. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ పార్టీ పెట్టడంపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అవి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
ఇక మరో పార్టీ పేరు కూడా వినిపిస్తోంది. వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పేరు కూడా ప్రధానంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఆమె ఈరోజు చలో లోటస్ పాండ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షర్మిల.. అభిమానులు, అనుచరులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ భవితకు పునాది అంటూ సోషల్ మీడియాలో జోరుకు కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే నిజమే అనే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల కొత్త పార్టీ అనే సంకేతాలను ఖండించారామె. కానీ.. తాజాగా వైఎస్‌ఆర్ సన్నిహితులకు షర్మిల దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వెళ్లడం.. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఆమె పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. షర్మిల పార్టీ పెట్టడం వెనుక కూడా పలువురి హస్తం ఉన్నట్లుగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె అన్న జగనే వెనకుండి ఆమెతో పార్టీ పెట్టిస్తున్నారని కొందరు అంటుండగా.. కాదు కాదు షర్మిల పార్టీ వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారంట ఇంకొందరి ఆరోపణ. అంతేకాదు.. బీజేపీ ప్రోద్బలంతోనే ఆమె పార్టీ పెడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా.. లోటస్‌పాండ్‌కు చేరుకున్న ఆమె కీలక వ్యాఖ్యలు కూడా వెల్లడించారు. గ్రౌండ్ లెవల్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే ఈ మీటింగ్‌లు పెడుతున్నట్లు చెప్పారు. అందుకే ముందుగా నల్లగొండ జిల్లా వారితో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు.. ప్రతీ జిల్లా వారితో మీట్ అయి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం కనిపించడం లేదని.. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తానంటూ స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కన ఆమె పార్టీ పెట్టడం దాదాపు ఖరారైనట్లే.
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కేబినెట్ మినిస్టర్ ఈటల రాజేందర్ సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తున్నారు. రెబల్ ఇమేజ్ కోసం అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఆయనను టీఆర్ఎస్ హైకమాండ్ కూడా దూరం పెట్టిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ సొంత పార్టీ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన మాత్రం మరో మాట లేకుండా ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. కానీ.. ఇతరులు మాత్రం ఆయన పార్టీ ఖాయమని రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్నారు. కుమారుడికి పట్టం కట్టాలనుకున్న కేసీఆర్.. ముప్పుగా ఉన్న కొంత మంది సీనియర్ల ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించుకుటూ వస్తున్నారు. ముందుగా హరీష్ రావును నిర్వీర్యం చేశారు. ఆయన నిర్వీర్యం అయ్యారా లేకపోతే వ్యూహాత్మకంగా అలా కనిపిస్తున్నారా అన్నది తర్వాత సంగతి. ఆ తర్వాత ఈటల ప్రాధాన్యం కూడా తగ్గించే ప్రయత్నం జరిగింది. కేసీఆర్ సొంత మీడియాలో ఆయనో ప్రజాదరణ లేని నేత అని.. బీసీ కాబట్టే మంత్రివర్గంలో ఉన్నారని ప్రచారం చేశారు. అప్పుడే ఆయన భగ్గుమన్నారు. ఆ తర్వాత ఆయనపై వ్యతిరేక వార్తలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ఈటల జోరందుకున్నారు. కేసీఆర్ పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని చెప్పారు. కానీ.. ఈటల మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ప్రతి గింజ కొనాల్సిందే అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కార్యవర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ నేతలు పార్టీలు పెడితే రాణించలేదన్న అభిప్రాయాన్ని చెప్పారు. బహుశా.. ఈటల పార్టీ పెడతారనే పక్కా సమాచారం ఉండటం వల్లనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ నడుస్తోంది. బీసీ నినాదంతో ఈటల తెలంగాణ సమాజంలోకి వెళ్తే కీలకమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. బీసీలంతా ఏకమైతే కొత్త రాజకీయ శక్తిగా అవతరించవచ్చు. ఈటలకు ఉద్యమ సమయం నుంచి ఎంతో కొంత పలుకుబడి ఉంది. ఆయనపై సానుభూతి కూడా ఉంది. కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న ప్రచారం నేపధ్యంలో ఇతర పార్టీల నుంచి ఈటలకు సానుభూతి వచ్చింది. దీంతో కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు.
కొద్ది రోజుల కిందట కేటీఆర్‌ను సీఎం చేస్తే.. టీఆర్ఎస్ నేతలు కొత్త పార్టీలు పెట్టుకుంటారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అవి ఉత్తుత్తి మాటలు కాదని.. నిజంగానే ఆ తరహా పరిస్థితులు ఉన్నాయని తాజా పరిణామాలతో నిరూపితం అవుతోంది. ప్రస్తుతం ఈటలకు అలాంటి ఆలోచన ఉన్నా లేకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో.. ఆయనపై టీఆర్ఎస్‌లో అపనమ్మకం పెరుగుతోంది. అప్పుడు సొంత పార్టీ పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడే రాజకీయం జరిగే చాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే రాబోతున్న ఎన్నికలకు మాత్రం తెలంగాణలో మరో రెండు పార్టీలైనా యాడ్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ మేరకు సక్సెస్ కాగలుగుతుంది..? ఏ పార్టీ మనుగడ సాధించగలుగుతుంది..? ఏ పార్టీ కీ రోల్‌గా మారనుంది..? భవిష్యత్ పరిణామాలే నిర్ణయిస్తాయి.
-శ్రీనివాస్