తెలుగు సినిమా రంగానికి చెందిన ‘మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్’ మా ఎన్నికల పై అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత బతుకు బతికి.. ఇంత సంపాదిస్తూ కనీసం ఒక ‘మా’కు ఒక ఎకరం భూమి సంపదించుకోలేరా? అని బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు. ‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని బాలయ్య ప్రశ్నించారు.
తెలంగాణ సర్కార్ నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? అని బాలయ్య బాబు ఎద్దేవా చేశారు. మా శాశ్వత భవనం నిర్మాణానికి ముందుకొచ్చిన విష్ణుకు బాలక్రిష్ణ సపోర్టు చేశారు. నేనూ అందులో భాగస్వామినవుతా అని బాలయ్య చెప్పారు.
అంతేకాదు అందరం కలిస్తే ‘మా’ కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు. దీంతోపాటు ఇది గ్లామర్ పరిశ్రమ, మన సమస్యలను బహిరంగంగా చర్చించకూడదు అని బాలయ్య హితవు పలికారు.
ఇక గతంలో మా’ పేరిట సాగిన నిధుల సేకరణ ప్రహసనాన్ని సైతం బాలయ్య ఎండగట్టారు. ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగిన సంగతిని ప్రశ్నించారు. అప్పుడు సేకరించిన డబ్బులు ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. నాడే ఎందుకు కట్టలేకపోయారని మండిపడ్డారు. మా భవన నిర్మాణానికి తాను సాయం చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు.