
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.
వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రజలకు చేరేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ కోసం అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలను ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ కేంద్రం వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయనుందని ఎవరికి వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాలో ఇప్పటికే కేంద్రం ప్రణాళికలు రూపొందించిందని సమాచారం.
కేంద్రం మొదట కరోనా వారియర్స్ కు వ్యాక్సిన్ ను ఇవ్వనుందని.. ఆ తరువాత వృద్ధులకు, పిల్లలకు ప్రాధాన్యత ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్రం ఆధార్ కార్డు ఉన్నవారికి వ్యాక్సిన్ ను ఇవ్వనుందని.. తద్వారా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగవని భావిస్తోందని సమాచారం. తొలి దశలో 30 కోట్ల మందికి కేంద్రం వ్యాక్సిన్ ఇవ్వనుందని.. ఆరోగ్యవంతమైన యువతీయువకులకు వ్యాక్సిన్ ఆలస్యంగా అందనుందని తెలుస్తోంది.
మరోవైపు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో వైరస్ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కేంద్రం వారి ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.