పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీలో నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. వైసీపీ, టీడీపీ నాయకులు యథేచ్ఛగా డబ్బును ప్రవహింపచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నామినేష్లను వేయకుండా గ్రామాల్లో చాలా మందిని అడ్డుకుంటున్నారు. గొడవలకు దిగి నామినేషన్లు వేసేవారిపై దాడులు చేస్తున్నారు. ఏక్రగీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. సర్కారు నిర్ణయాలకు అడ్డు తగులుతూ.. గ్రామాల్లో టీడీపీ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు సైతం ఇటీవల బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆడియో బయటపడింది. దాడులు చేస్తున్న టీడీపీ నాయకులను గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేస్తుంటే.. రాజకీయం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.
పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో, చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించి బెదిరింపులకు పాల్పడ్డారు. అచ్యుతాపురత్రయం పంచాయతీలో కురకుదురు 8వార్డు మెంబరు పదవికి నామినేషన్ వేసిన కూళ్ల లక్ష్మి తాను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారికి లేఖ ఇచ్చి రశీదు తీసుకెళ్లారు. గంట తరువాత వచ్చి తనను కొందరు బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని ఆర్వోకి చెప్పారు.
చౌడేపల్లి మండలంలో ముగ్గురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఏండీపీవో ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం నాయకులు శ్రీనాధ్ రెడ్డి, రమేశ్ రెడ్డి, రామచంద్రం తన అనుచరులతో కార్యాలయానికి వచ్చారు. తన పార్టీ నాయకుల నో డ్యూస్ సర్టిఫికెటు జారీ చేయడానికి పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఎండీపీవో సమాధానం చెబుతుండగానే వారు దుర్భాషలాడారు. ఆయనతో పాటు పంచాయతీ కార్యదర్శులను బెదిరించారు. ఈ విషయమై ఎంపీడీవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారు. వైఎస్సార్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కారు.జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో టీడీపీ నేతలు తమ మద్దతుదారుడిని బరిలో నిలిపి అతడిని గెలిపించాలంటూ.. డబ్బులు పంచుతూ.. గ్రామస్తులకు ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల చర్యలను గురించి అక్కడి ప్రజలే ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగారు. టీడీపీ నాయకులకు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి రూ.5వేల రూపాయాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు అంటున్నారు.
ఇక అధికార వైసీపీ పార్టీ మాత్రం పోలీసుల అండతో ఈ వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రహస్యంగా పంచాయితీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిని పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు వాపోతున్నారు.