70 ఏళ్ల వృద్ధుడు చంద్రబాబు ఎండలు మండుతున్న వేళ కనీసం అసెంబ్లీ ఎన్నికలు కూడా కానీ మున్సిపల్ ఎన్నికల కోసం గల్లీ గల్లీ తిరుగుతూ ఈ ఏజ్ లో కష్టపడుతున్నాడు. పాపం చంద్రబాబు శ్రమ చూసైనా అన్నీ ఇన్నో ఓట్లు రాలబోతున్నాయి.
అయితే నవ యువకుడు,. హీరో జనసేనాని పవన్ మాత్రం ఒక్క వీడియోతో తన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆన్ లైన్ లో నిర్వహించి మమ అనేశారు. ఇది ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం తీరు..
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్టినగర్ లో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలంతా ఆయన ట్రాప్ లో పడి మోసపోయారని విమర్శించారు. అప్పుడు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
టీడీపీ హయాంలో చేసిన పనులన్నీ కొట్టుకుపోయాయని.. పథకాలను రద్దు చేశారని చంద్రబాబు విమర్శించారు. నోట్లు ఇచ్చి మాయ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 6 లక్షల కోట్లు అంటూ తనపై అవినీతి ఆరోపణలు చేశారని.. 6 పైసలు కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.
*విశాఖ ఉక్కుపై పడ్డ పవన్
ఇక పవన్ కథ వేరే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని జనసేన అధ్యక్షుడు పవన్ విమర్శించారు. 22మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ఏం చేశారని.. పార్లమెంట్ లో ఎందుకు నిలదీయలేదని విమర్శించారు. తాను అమిత్ షాను కలిసి ఒత్తిడి తెచ్చానని.. కానీ ప్రైవేటీకరణ దేశవ్యాప్త నిర్ణయమని అంటున్నారని వివరించారు.
ఇలా చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల కోసం రోడ్డెక్కితే.. జనసేనాని పవన్ మాత్రం ఆన్ లైన్ లో ఒక వీడియో రిలీజ్ చేసి విశాఖ మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడేశారు.