Homeఅత్యంత ప్రజాదరణహైకోర్టు లాయర్ల హత్య వెనుక బిట్టు శీను.. నిందితుడు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు?

హైకోర్టు లాయర్ల హత్య వెనుక బిట్టు శీను.. నిందితుడు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు?

 Vaman Rao couple

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్య కేసులో నిందితులు వాడిన నంబరు లేని కారు బిట్టు శ్రీనుది. కారుతోపాటు నిందితులకు కత్తులను, డ్రైవర్‌ను సమకూర్చింది కూడా అతడే! ఈ బిట్టు శ్రీను మరెవరో కాదు.. మంథని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ మేనల్లుడే. మధుకర్‌ సోదరి కుమారుడు. దీంతో.. హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. వామన్‌రావు, నాగమణి హత్య వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంథని ప్రాంతంలో నాలుగైదేళ్లుగా పలు ఘటనలు, నేతల వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేయడం వారి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

నిజానికి.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ ఇసుక దందాతో అక్రమంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తులు, 400 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటూ వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారు. అది అప్పట్లో సంచలనం రేపింది. సరైన ఆధారాలు లేనందున కేసును కోర్టు కొట్టి వేసింది. అలాగే, 2016–-17లో మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడడం వల్లనే మధుకర్‌ను హత్య చేశారని, దీనిపై విచారణ జరిపించాలని కోర్టులో వామన్‌ రావు కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఫోరెన్సిక్‌ నిపుణులతో రీ పోస్టుమార్టమ్‌ చేయించారు. అయితే.. మధుకర్‌ది ఆత్మహత్యేనని తేలింది. ఇక.. గతేడాది మంథని మండలానికి చెందిన శీలం రంగయ్యను వన్య ప్రాణులను వేటాడుతున్న కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారు జామున బాత్‌రూంకు అని వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రభావితం చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోర్టులో వామన్‌ రావు కేసు వేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసు శాఖ నగర కమిషనర్‌ సీపీ అంజన్‌ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన మంథనికి వచ్చి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. దీనిపై ఇంకా ఏమీ తేలలేదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు, వ్యవహారాలపై వామన్‌ రావు తరచూ జోక్యం చేసుకుంటుండడం వల్లనే ఆయనను హత్య చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే.. వామన్‌ రావు దంపతులపై ఆది నుంచి ఆ ప్రజాప్రతినిధికి కోపం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా అడ్డు తప్పించాలనే టార్గెట్‌తోనే ఇలాంటి దాడికి పాల్పడినట్లుగా సమాచారం. మొత్తంగా నిన్నటి వామన్‌రావు దంపతుల మర్డర్‌‌లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌‌ మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తెరవెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతలను మొత్తం బిట్టు శ్రీనునే చూస్తుంటాడు. వామన్‌రావు దంపతుల హత్యకు కావాల్సిన కత్తులు, కార్లు సమకూర్చాడు. అయితే.. కత్తులు తెచ్చిన ఆ దుకాణం కూడా ఓ ప్రజాప్రతినిధికి చెందినదనే టాక్‌. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే.. అతను మాత్రం ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు చెబుతున్నారు.

ఈ జంట హత్యల కేసులో ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. ‘గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌‌తోపాటు విలోచవరం గ్రామానికి చెందిన శివందుల చిరంజీవి కలిసి వామన్‌రావు దంపతులను చంపడానికి పథకం వేశారు. కుంట శ్రీనివాస్‌ తనకు తోడుగా కుమార్‌‌ను తీసుకెళ్లాడు. వీరికి పుట్ట లింగమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడైన తులిసెగారి శ్రీను అలియాస్‌ బిట్టు శ్రీను తన కారుతోపాటు కొబ్బరి కోండాలు కొట్టే రెండు కత్తులను సమకూర్చాడు. కారును చిరంజీవి నడపగా కుంట శ్రీను పక్కన కూర్చున్నాడు. వామన్‌రావు, నాగమణిల కంటే ముందుగానే చిరంజీవి వేగంగా కారు నడిపి కల్వచర్ల వద్ద కాపు కాశారు. అక్కడ రోడ్డు పనులు జరిగిన చోట నెమ్మదిగా వెళ్తాయని భావించి అక్కడే వామన్‌రావు కారును అడ్డగించారు. అద్దాన్ని కత్తులతో బద్దలుకొట్టారు. డ్రైవర్‌‌ సతీష్‌ భయపడి కారు దిగి పారిపోయాడు. వామన్‌రావు వెంటనే డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చి కారు నడిపేందుకు ప్రయత్నించగా కుంట శ్రీను అతన్ని బయటికి లాగి కత్తులతో పాశవికంగా దాడి చేశాడు. చిరంజీవి కారుకు రెండో వైపు నుంచి వచ్చి నాగమణిపై కత్తితో దాడిచేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. సీట్లోనే పడిపోయింది. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. నాపై దాడి చేసింది కుంట శ్రీనివాస్‌తోపాటు మరొక వ్యక్తి అని వామన్‌రావు చెప్పారు. దాడి అనంతరం కుంట శ్రీను, చిరంజీవి కారులో సుందిళ్ల బ్యారేజీకి వెళ్లారు. రక్తపు మరకలంటిన దుస్తులను పడేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర పారిపోతూ తెలంగాణ పోలీసులు తనిఖీ చేస్తున్నారనే సమాచారంతో ముంబయి మార్గానికి వెళ్తుండగా వాకిండి–చంద్రపూర్‌‌ మధ్యలో పట్టుకున్నాం’ అని ఐజీ చెప్పారు. మరో నిందితుడు అక్కపాక కుమార్‌‌ కారులో స్వగ్రామానికి పారిపోతుండగా మంథనిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంజపడుగు గ్రామంలోని రామాలయ కమిటీకి సంబంధించి వెల్ది వసంతరావు, గట్టు విజయకుమార్‌‌లపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు, చిన్న తమ్ముడు ఇంద్రశేఖర్‌‌రావు సంతకాలు తీసుకున్నారు. తిరిగి వీరు ఆటోలో గ్రామానికి చేరుకునే సరికి వామన్‌రావు డ్రైవర్‌‌ సతీష్‌ ఫోన్‌ చేసి హత్య జరిగిందని చెప్పారు. గుంజపడుగు గ్రామంలో రెండు దేవస్థానాల కోసం మంథని టీఆర్‌‌ఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న కుంట శ్రీనివాస్‌, అదే గ్రామానికి చెందిన అక్కపాక కుమార్‌‌, వెల్ది వసంతరావు కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ కార్యదర్శి వామన్‌రావు తమ్ముడైన ఇంద్రశేఖర్‌‌రావును వీరు పిలిచి సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కుంట రాజు పంచాయతీ పర్మిషన్‌ లేకుండానే దండోరా వేయించారు. దీంతోపాటు కుంట శ్రీనివాస్‌ ఇదే గ్రామంలో పెద్దమ్మ ఆలయాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని, కొత్తగా అక్రమ భవనాన్ని నిర్మిస్తున్నాడని పలుమార్లు సర్పంచితోపాటు వామన్‌రావు, నాగమణి ప్రశ్నించారు. దీంతో కక్ష పెంచుకొని కుంట శ్రీనివాస్‌, వెల్ది వసంతరావు, అక్కపాక కుమార్‌‌ తన కొడుకు, కోడలిని హత్య చేశారని మృతుని తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు.

లాయర్‌‌ వామన్‌రావు, కుంట శ్రీనివాస్‌ గుంజపడుగు గ్రామస్తులే. ఐదేళ్లుగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. వామన్‌రావు అన్ని పనులకు ఆటంకం కలిగిస్తూ కేసులు వేస్తూ తన ఎదుగుదలకు ఆటంకంగా మారాడని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆలయ కమిటీ ఏర్పాటు, కుల దేవతైన పెద్దమ్మ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని తట్టుకోలేక కోపంతో కుట్ర పన్నాడు.

మంథని నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ లీడర్లు చేస్తున్న అక్రమాలపై వామన్‌రావు, నాగమణి దంపతులు కొన్నేండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. టీఆర్‌‌ఎస్‌ లీడర్ల ఇసుక, కలప దందాలు, అవినీతి, అక్రమాలపై హైకోర్టులో కేసులు వేసి నడిపిస్తున్నారు. మంథని నియోజకవర్గం జరిగిన అనుమానాస్పద మరణాలు, లాకప్‌డెత్‌లపైనా హైకోర్టులో పిల్స్‌ వేశారు. పోలీసు ఆఫీసర్లు మాత్రం గ్రామంలో కుంట శ్రీను కడుతున్న ఇల్లు, పెద్దమ్మ గుడికి పర్మిషన్‌ లేకపోవడాన్ని ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు తమ ఎంక్వైరీలో తేలిందని చెబుతున్నారు. ఈ పాటి చిన్న వివాదానికే నడిరోడ్డుపై ఇద్దరు లాయర్లను నరికి చంపుతారా..? అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular