https://oktelugu.com/

చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’!

  ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నాడు దాశరథి. నిజాం నిరుకుశంలో నిప్పు కణికలు కురిపించాడు ఆ మహా కవి. భూమి కోసం.. భుక్తి.. తెలంగాణ విముక్తి కోసం ఎంతో మంది సాయుధం పోరాటం చేశారు. ఓ చాకలి ఐలమ్మ, అనభేరి ప్రభాకర్ రావు, పరకాల విప్లవ వీరులు ఇలా ఎంతో మంది ‘హైదరాబాద్ సంస్థానం’లో నిజాం రాజుతో పోరాడి అసువులు బాసారు. తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రపంచ చరిత్రలోనే ఓ మహా అద్భుత ఘట్టం. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 01:03 PM IST
    Follow us on

      ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నాడు దాశరథి. నిజాం నిరుకుశంలో నిప్పు కణికలు కురిపించాడు ఆ మహా కవి. భూమి కోసం.. భుక్తి.. తెలంగాణ విముక్తి కోసం ఎంతో మంది సాయుధం పోరాటం చేశారు. ఓ చాకలి ఐలమ్మ, అనభేరి ప్రభాకర్ రావు, పరకాల విప్లవ వీరులు ఇలా ఎంతో మంది ‘హైదరాబాద్ సంస్థానం’లో నిజాం రాజుతో పోరాడి అసువులు బాసారు. తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రపంచ చరిత్రలోనే ఓ మహా అద్భుత ఘట్టం. కానీ చరిత్ర ఎందుకో తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాచేసింది. ఇప్పటికీ దీనిపై సరైన పుస్తకాలు లేవు.. తెలంగాణలో పాఠ్యాంశాలుగా లేవు. మరే ఇతర కారణాలో తెలియదుగానీ సాయుధ చరిత్ర ఎందుకో అందరికీ చేరలేకపోయింది.. ప్రజలే కర్రలు, కారం, బడిసెలు, రాళ్లు, రప్పలూ ఆయుధాలుగా మలిచి పోరాడిన ఆ తెలంగాణ సాయుధ పోరాటం.. ఈ ‘తెలంగాణ విమోచన దినం’ రోజున అయినా భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ మేధావులు, సమాజం పాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది..

    Also Read: దెబ్బకు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్

    ఒకవైపు జమీందార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలు, మరోవైపు రజాకార్ల అకృత్యాలు, అరాచకాలు కలగలుపుకొని నిజాం నవాబుల నిరంకుశ పాలన కారణంగా తెలంగాణ అంతటా నిర్బంధ పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఈ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. సామాన్య ప్రజలే సాయుధులై ముందుకు నడిచారు. కర్రలు, కారం, బడిసెలు, రాళ్లు, రప్పలూ ఆయుధాలయ్యాయి. నాటు తుపాకులు పేల్చడం మొదలుకొని గెరిల్లా యుద్ధతంత్రం వరకూ రాటుదేలారు. ఇదే క్రమంలో కమ్యూనిస్ట్‌ పార్టీకి ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ పెరిగింది. సాయుధ పోరాటంలో దాదాపు నాలుగు వేల మందికి పైచిలుకు అమరులయ్యారు. పోలీస్‌ చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయినా కమ్యూనిస్ట్‌ పార్టీకి తెలంగాణ ప్రజానీకమంతా అండగానే ఉంది.

    కమ్యూనిస్ట్‌ పార్టీని ప్రజలు ఎంతగా ఆదరించారని చెప్పడానికి 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలే ఉదాహరణ. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన రావి నారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో దేశంలోనే అధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాతి నుంచి వరుసగా లోక్‌సభకు, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన ప్రాంతాల ప్రజలు కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తూ వచ్చారు. మారిన రాజకీయ పరిస్థితులు.. మలి దశ తెలంగాణ ఉద్యమం కారణంగా కమ్యూనిస్టులకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం కరువైంది.
    తెలంగాణ సాయుధ పోరాటానికి కలం..గళం కూడా తోడుగా నిలిచింది. దాశరథి కృష్ణమాచార్య ‘ఓ నిజాము పిశాచమా నినుబోలిన రాజుమాకెన్నడేని.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నా,.. యాదగిరి రాసిన ‘నైజాము సర్కరోడా.. నాజీలను మించినోడా.. గోల్కొండ ఖిల్లా కింద గోరీ కడతాం.. కొడుకా నైజాం సర్కరోడా’తోపాటు సుద్దాల హనుమంతు తదితరులూ అక్షర యుద్ధం చేసి సాయుధ పోరాటానికి స్ఫూర్తి నింపిన వారే.

    భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం సాగింది. కానీ.. స్వరాష్ట్రం వచ్చాక పరిస్థితుల్లోనూ.. ఇప్పటితరంవారు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడం లేదు. రాజకీయ కోణంలో చూస్తున్న కారణంగానే సాయుధ పోరాట చరిత్ర క్రమక్రమంగా మరుగునపడుతోంది. పోలీస్‌ చర్య తర్వాత హైదరాబాద్‌ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలను కర్ణాటక, మహారాష్ట్రలలో కలిపారు. అక్కడ సెప్టెంబర్‌ 17వ తేదీన ఉత్సవాలు జరపడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. మన దగ్గరకు వచ్చే సరికి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు విమోచన దినం అంటూ జాతీయ పతాకాలు ఎగురవేస్తుండగా, మరికొన్నిపార్టీలు విద్రోహ దినం అంటూ నల్లజెండాలు ఎగురవేస్తున్నాయి. మరికొందరు దేశంలో ఒక ప్రాంతం విలీనం అయ్యిందంటూ సరిపెట్టేస్తున్నారు.

    Also Read: తెలంగాణ ‘విమోచనం’ ఎలా అయ్యింది?

    ఈ పోరుపై అవగాహన లేక.. అవగాహన కల్పించే వారూ లేక తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. ఈ పోరు ఇప్పటివరకు చరిత్రలోకి కూడా ఎక్కలేదు. ఇప్పటివరకూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రపై పుస్తకాలూ లేవు. వీధికో వీరుడు.. ఊరుకో దళం, ప్రాంతాల వారీగా నాయకత్వ బాధ్యతల నిర్వహణ కారణంగా ఎక్కడి చరిత్ర అక్కడే నిక్షిప్తమై ఉంది. ఆయా ప్రాంతాల్లోనూ.. ఆయా సందర్భాల్లోనూ… కొంతమేర పుస్తకరూపంలోకి వచ్చినా, అది తెలంగాణ సామాజానికి చేరువ కాలేదు. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్నవారు తమ అనుభవాలను పుస్తకరూపంలోకి తెచ్చినా.. దానికీ పార్టీ రంగు పులిమే ప్రయత్నాలో.. మరే ఇతర కారణాలో తెలియదుగానీ సాయుధ చరిత్ర ఎందుకో అందరికీ చేరలేకపోయింది. పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా.. తెలంగాణ  ప్రాంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులుగానే వారిని చూడాలి. భవిష్యత్‌ తరాలకు ఆ సాయుధ పోరాట పటిమ చేరేలా చూడాలి. అప్పుడే సామాన్యులే.. సాయుధులైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి.