
ఏపీలో కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. 11 నగర పాలక సంస్థలు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.
తాజా ఫలితాల ప్రకారం.. వైసీపీ 13 మున్సిపాలిటలను కైవసం చేసుకుంది. కొవ్వూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఎర్రగుంట్ల, రాయచోటి, మదనపల్లె, ఆత్మకూరు, పలమనేరు, కనిగిరి, గిద్దలూరు, డోన్, పుంగనూరు, పులివెందుల, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలటీలను వైసీపీ గెలుచుకుంది.
అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తాయని అందరూ ఊహించారు. కానీ ఇది అందరినీ ఆకర్షించాయి. అయితే అమరావతి సెంటిమెంట్ ఇక్కడ పనిచేయలేదు. వైసీపీనే విజయం సాధించింది. టీడీపీ ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం వైసీపీని గెలిపించి మూడు రాజధానులకే జైకొట్టారని అర్తమవుతోంది. గుంటూరు కార్పొరేషన్ లో 57 డివిజన్లు ఉండగా.. వైసీపీ ఏకంగా 33 డివిజన్లు కైవసం చేసుకొని సత్తాచాటింది. టీడీపీ 4, జనసేన 4, బీజేపీ 2 చోట్ల విజయం సాధించాయి. దీన్ని బట్టి మూడు రాజధానులకు అమరావతి ప్రజలు మద్దతు ఇచ్చినట్టేనని అర్థమవుతోంది.
*విశాఖలో వైసీపీ లీడ్
ఏపీలోనే అత్యధిక స్థానాలున్న కార్పొరేషన్ విశాఖలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. విశాఖలో మొత్తం 90 డివిజన్లు ఉన్నాయి. తాజాగా వైసీపీ 11 స్థానాల్లో, టీడీపీ 9, జనసేన 1, స్వతంత్రులు 1, సీపీఎం 1 చోట విజయం సాధించారు. ఇక బ్యాలెట్ బాక్సుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాసిన పత్రాలు కనిపిస్తున్నాయి.
*విజయవాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన టీడీపీ మేయర్ అభ్యర్థిగా 11వ డివిజన్ నుంచి పోటీచేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు. 24 ఏళ్ల శ్వేత ఫారిన్ లో విద్యాభ్యాసం చేసి కీలక సంస్థల్లో పనిచేసి ఇండియాకు వచ్చారు. విజయవాడ నగర పాలక సంస్థలో హోరాహోరీ నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. వైసీపీ 8 డివిజన్లు, టీడీపీ 6 డివిజన్లు కైవసం చేసుకుంది. విజయవాడ తూర్పులో టీడీపీ ప్రభావం ఉండగా.. సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. దీంతో ఇక్కడ హోరాహోరీ కొనసాగుతోంది.
*హిందూపురంలో టీడీపీ లీడ్
హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. హిందూపురంలోని మొత్తం 38 వార్డుల్లో ఇప్పటివరకు 3 వార్డుల్లో టీడీపీ గెలిచింది. వైసీపీ ఖాతా తెరవలేదు.
*ఒంగోలు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1 చోట గెలుపొందారు.
*తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకొని టీడీపీ ఏపీలో ఖాతా తెరిచింది.
*తిరుపతి కార్పొరేషన్ లో మొత్తం 50డివిజన్లలో 27 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా.. కేవలం ఒకేస్థానంలో టీడీపీ గెలిచింది. ఈ ఫలితం తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపునకు దోహదం పడుతుందని తెలుస్తోంది.
*అమలాపురంలో జనసేన సత్తా ..
అమలాపురం మున్సిపల్ ఫలితాల్లో జనసేన సత్తాచాటింది. జనసేన 3,4,6,7,9 వార్డులను మొత్తం 5 డివిజన్లను కైవసం చేసుకుంది. వైసీపీ 4, టీడీపీ 2, స్వతంత్రులు 1 గెలుచుకున్నారు.
కార్పొరేషన్ల వారీగా వివిధ పార్టీల గెలుపు ఓటములు ఇవే..
