
అక్కినేని నాగేశ్వరరావు కొత్త సినిమా ఏంటీ..? ఇప్పుడు విడుదల కావడమేంటీ..? అని ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే ఇది. నిజంగానే ఏఎన్ఆర్ కొత్త చిత్రం విడుదల కాబోతోంది. అసలు విషయం ఏంటనేది తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
అప్పట్లో అక్కినేని ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సినిమా అంటూ తీస్తే.. ఏఎన్ఆర్ తో తీయాలని ఆరాటపడేవారు నిర్మాతలు. అలాంటి సమయంలోనే ప్రము నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి ‘ప్రతిబింబాలు’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. 1982 సెప్టెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది.
ఇందులో హీరో అక్కినేని, హీరోయిన్లుగా జయసుధ, తులసి నటించారు. అయితే.. అనుకోని సంఘటనల వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎన్ని సమస్యలు అధిగమించినా.. మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఈ చిత్రాన్ని కొంత భాగం ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావు, మరికొంత భాగాన్ని మరో ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. అయితే.. ఏదిఏమైనా, ఎన్నాళ్లకైనా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు నిర్మాత. అది ఇన్నాళ్లకు అంటే.. 39 సంవత్సరాలకు సాధ్యమవుతుండడం విశేషం.
మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత రాధాకృష్ణ మూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ లేని ఒక కొత్త కథతో ఈ సినిమాను మొదలు పెట్టాం. అయితే.. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా అలాంటి కథతో రాలేదు. ఈ సినిమా చూసిన అక్కినేని అభిమానులు, ఇతర ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతారు. నవ యువకుడిగా ఏఎన్నార్ అలరిస్తారు’ అని చెప్పారు.
అలనాటి నటులు గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు వంటి ఎందరో ఈ సినిమాలో నటించారు. సంగీతం చక్రవర్తి సమకూర్చారు. నిజంగా.. ఒక సినిమా మొదలైన 39 సంవత్సరాల తర్వాత విడుదల కానుండడం బహుశా ఇదే మొదటిది కావొచ్చు. అది కూడా హీరో మరణించిన తర్వాత!