సమాజంలో ఒకప్పుడు జర్నలిస్టులంటే ఎంతో గౌరవం. సమాజంలోని అవినీతిని, అక్రమాలను వెలికితీసే ప్రజాస్వామ్యంలోని నాలుగో సింహంగా గుర్తించేవారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేసేవారు.
కానీ కాలం మారింది. పార్టీలు జర్నలిజంలోకి వచ్చాయి.. పార్టీకో పత్రిక.. చానెల్ పెట్టాయి. నిజాలు పార్టీల వారీగా చీలిపోయి జర్నలిస్టుల బతుకులు కబంధ హస్తాల్లో చిక్కిపోయాయన్న ఆవేదన జర్నలిస్టుల్లో ఉంది.
ఇప్పుడు కరోనా కల్లోలంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆర్థికంగా చితికిపోయాయి. అన్నింటికంటే ఎక్కువగా మీడియా వ్యవస్థ దెబ్బతింది. తెలుగులోని అగ్రపత్రికలు చానెల్స్ జర్నలిస్టులను తగ్గించేసి ఏడాది క్రితమే కరోనా లాక్ డౌన్ వేళ రోడ్డున పడేశాయి. ఇక ఏడాదిగా పత్రికాలన్నీ జిల్లా సంచికలు ఎత్తేసి ఏదోలా నడిపిస్తున్నాయి. పదుల సంఖ్యలోనే జర్నలిస్టులను ఉంచుకున్నాయి.
అయితే వారికి కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఏడాదికాలంగా యాజమాన్యం జీతాలు చెల్లించలేకపోవడంతో తమ జీవన భృతి కోల్పోయి తమ కుటుంబాలు బజారునపడ్డాయని.. ఇంటి అద్దెలు కూడా చెల్లించలేక.. పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులకు సైతం డబ్బులు లేక పడరాని పాట్లు పడుతున్నామని.. ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు తాజాగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హెచ్.ఆర్.సీలో పిటీషన్ దాఖలు చేశారు.
మీరైనా న్యాయం చేయండని హెచ్.ఆర్.సీ చైర్ పర్సన్ జస్టిస్ చంద్రయ్యను ఆంధ్రభూమి ఉద్యోగులు వేడుకున్నారు. కరోనా సాకుతో ఏడాదిగా ఆంధ్రభూమి పత్రిక ప్రచురణ నిలిపివేశారని.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని.. వారు పిటీషన్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన మానవ హక్కుల చైర్ పర్సన్ చైర్ పర్సన్ చంద్రయ్య ఆంధ్రభూమి యజమాన్యానికి ఆయన నోటీసు జారీ చేశారు.