దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే నవరాత్రులు ప్రారంభం అవడంతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను దర్శిస్తున్నారు. నియమనిష్టలతో, కటిక ఉపవాసాలతో పూజలో పాల్గొని ఆ తల్లిని పూజిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా బుధవారం పంచమి కావడంతో అమ్మవారు స్కందమాత గా కొలువై ఉన్నారు.
బుధవారం ఉదయం నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు స్కందమాత గా దర్శనం కల్పిస్తున్నారు. స్కందమాత కమలంపై కూర్చోవడం వల్ల ఆ మాతను పద్మాసన అని కూడా పిలుస్తారు. తెలుపు రంగు చీర ధరించి నాలుగు చేతులు కలిగి ఉండి, మొదటి రెండు చేతులు తామర పువ్వులతో దర్శనమిస్తూ, మరొక చేతితో ఆరు తలలు కలిగినటువంటి కుమార స్వామిని తన ఒడిలో పడుకోబెట్టుకుని మనకు స్కంద మాత దర్శనం కల్పిస్తుంది.
ఎర్రని పువ్వులంటే స్కంద మాత కు ఎంతో ఇష్టం నవరాత్రుల లో భాగంగా ఐదవ రోజున ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఐదవ రోజు అమ్మవారు పంచమి రోజు కాబట్టిసరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఐదవ రోజున అమ్మవారికి పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఉండి సింహవాహనంపై ఆలయాలలో కొలువై ఉన్నారు.
భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించి అమ్మవారి స్తోత్రం పఠించడం ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంది. అయితే ఇప్పటికే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకొని దర్శనం చేసుకుంటున్నారు.