
దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో అత్యుత్తమ నెట్వర్క్ లలో ఒకటైన ఎయిర్ టెల్ భవిష్యత్తులో టారిఫ్ ధరలు పెంచే దిశగా అడుగులు వేయనుందని తెలుస్తోంది. జియో రాకతో గతంలో టారిఫ్ ఛార్జీలను తగ్గించిన కంపెనీలు ప్రస్తుతం మెల్లగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
జియో ప్రభంజనం మొదలైన సమయంలో టారిఫ్ ప్లాన్ల ధరలు భారీగా తగ్గగా కొన్ని నెలల క్రితం జియో, ఎయిర్ టెల్ , వొడాఫోన్ ఐడియా ఛార్జీలను పెంచేశాయి. ఇప్పటికే ఛార్జీలు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఛార్జీలు మళ్లీ పెరగొచ్చంటూ వస్తున్న వార్తలు వాళ్లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎయిర్ టెల్ ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ చేసిన వ్యాఖ్యలు ఎయిర్ టెల్ ఛార్జీలు పెంచవచ్చనే అనుమానం కలిగేలా చేస్తున్నాయి.
భవిష్యత్తులో ఛార్జీలను పెంచవచ్చంటూ గోపాల్ విట్టల్ వ్యాఖ్యలు చేశారు. అయితే టారిఫ్ ధరలను ఎప్పటినుంచి పెంచుతారనే విషయం మాత్రం చెప్పలేదు. ఏడాది క్రితం ఎయిర్ టెల్ యూజర్ నుంచి పొందే సగటు ఆదాయం 128 రూపాయలు కాగా ఈ ఏడాది ఆ ఆదాయం 162 రూపాయలకు చేరింది. అయితే ఎయిర్ టెల్ రానున్న రోజుల్లో సగటు ఆదాయన్ని మరింత పెంచుకోవాలని.. ఆదాయం ఏకంగా 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెరగాలని భావిస్తోంది.
విట్టల్ మాట్లాడుతూ ఎయిర్ టెల్ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడమే ప్రథమ బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. ఇప్పటికే జియో తక్కువ ధరకు ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొని రాగా అదే విధంగా స్మార్ట్ ఫోన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఎయిర్ టెల్ సైతం భవిష్యత్తుల్లో తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తెస్తామంటూ వెల్లడించింది.