
WhatsApp Nude Video Call: అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ మన జీవితాలను నిర్దేశిస్తున్నది. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మాట్లాడే మాట నుంచి… సినిమా థియేటర్లో చూపించే ఆట వరకు అన్ని దీంట్లోనే. సమస్తం హస్తభూషణంలోనే.. కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు కనిపించని చీకట్లు ఇందులో ఉన్నాయి.. వాటిని ఎరగకుండా పోతే భవిష్యత్తును అంధకారం చేస్తాయి.
ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు.. ఫోన్ కాల్ జీవితాలను తారుమారు చేస్తోంది. తేరుకునే లోపే అంతులేని ఆవేదనను మిగుల్చుతోంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో మగవాళ్ళు మాత్రమే బాధితులుగా ఉండేవారు. తాజాగా మహిళలనూ ఈ ఉచ్చు లోకి ఉంచుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మధ్య ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ఓ పాతికేళ్ల యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థికంగా స్థిరత్వం సంపాదించడంతో ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో అతడికి ఫేస్బుక్లో ఓ యువతీ పరిచయమైంది. కొన్నాళ్లు ఆమెతో చాటింగ్ చేశాడు. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొద్ది రోజులకు వాట్స్అప్ నెంబర్ కు నగ్న వీడియో కాల్ చేసింది. అతడు దాన్ని చూస్తున్నట్టు అటువైపు వీడియో తీశారు. ఊహించని ఈ ఘటన నుంచి తేరుకునే లోగానే రెండు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాదంటే ఆ దృశ్యాలను స్నేహితులు, బంధువులకు పంపుతామంటూ బెదిరించారు. దీంతో ఆ యువకుడు తట్టుకోలేక తాను దాచుకున్న సొమ్ము నించి 50 వేలు ఇచ్చి బయటపడ్డాడు. మరోసారి డిమాండ్ చేస్తే లక్ష దాకా ఇచ్చాడు. ఇక అటువైపు నుంచి తరచూ డబ్బులు కావాలని ఫోన్లు వస్తుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం ఖమ్మం మాత్రమే కాదు హైదరాబాద్ నగర పరిధిలో మూడు కమిషనరేట్లకు వలపు వల విసిరి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలకు సంబంధించిన కేసులు 100 దాకా రావటం, అది కూడా గడిచిన 60- 70 రోజుల్లో వ్యవధిలో రావడం విశేషం.

డబ్బులు వసూలు చేసే మాయగాళ్లకు ప్రస్తుతం యాప్సే కీలకాస్త్రాలు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్లో అందమైన చిత్రాలు, ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్టు నింపుతారు. అండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే చాటింగ్ చేస్తారు. అవతలి వారి వయసు, సామాజిక హోదా తదితర విషయాలను ధ్రువీకరించుకున్నాక.. అర్ధరాత్రి దాటాక వాట్సప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతారు. బుట్టలో పడినట్టు నిర్ధారించుకున్న తర్వాత తమ అసలు పథకం అమలు చేస్తారు.
వాట్సాప్ లో నగ్న వీడియో కాల్ చేసి చూస్తున్నట్టు స్క్రీన్ రికార్డింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 20,000 నుంచి ఐదు లక్షల దాకా బ్యాంకు ఖాతాలో జమ చేయించుకుంటున్నారు. ఎదురు తిరిగితే సామాజిక మాధ్యమాల్లో ఆరు నాగిన వీడియోలను పెడుతున్నారు. అయినప్పటికీ లొంగకపోతే ఫోన్ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలను పంపుతున్నారు. మీ స్నేహితుడు లేదా సోదరుడితో కలిసి మీరు నగ్న వీడియోలో చూస్తున్నారంటూ మార్నింగ్ ఫోటోలతో పరువు తీస్తామని బెదిరిస్తున్నారు.
ఈ తరహా కేసులు ఇటీవల భారీగా పెరగడంతో పోలీసులు యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడితే స్పందించవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు వాట్సప్ వీడియో కాల్స్ చేస్తే ఎత్తకూడదని వివరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు సామాజిక మాధ్యమాల జోలికి ఎక్కువ వెళ్లకూడదని చెబుతున్నారు.