World Cancer Day: తిండి మార్చితే సగం క్యాన్సర్ ను జయించినట్టే

రోజురోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : February 4, 2024 6:47 pm

World Cancer Day

Follow us on

World Cancer Day: తిండి తింటే కండ కలుగుతుందని వెనకటికి ఓ మహాకవి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ మాట మార్చుకోవాలి. తిండి ఎంత ఎరుకతో తింటే అంత మంచిది అనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. కాలం మారింది. కాలంతో పాటు తినే తిండి కూడా మారింది. ఒకప్పుడు సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే ఇంట్లో మాంసాహారం తినేవారు. అత్యవసరం అయితే తప్ప వాహనాల మీద వెళ్లేవారు కాదు. ఎక్కువ శాతం కాలినడకలేదా సైకిల్ మీద వెళ్లేవారు. దీనివల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. అన్నింటికీ మించి బయట తిండి ఉండేది కాదు.. ఫలితంగా పెద్దగా వ్యాధులు కూడా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగు అడుగులు నడిచేంత ఓపిక కూడా జనాలకు ఉండడం లేదు. ఇంట్లో తిండి తగ్గిపోయింది. హోటల్స్ లో తినడం పెరిగిపోయింది. అన్నింటికీ మించి మాంసాహారం అనేది ఎక్కువైపోయింది. శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం పెరిగిపోయింది. ఫలితంగా రకరకాల వ్యాధులు సోకడం మొదలైంది. అందులో మధుమేహం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే.. క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ఆ క్యాన్సర్ లో కూడా స్త్రీలలో అయితే రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో అయితే నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్ వంట కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

రోజురోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. రెండవది వంశపారంపర్యంగా క్యాన్సర్ సోకడం. దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సర్వే నిర్వహించింది. 2040 నాటికి మనదేశంలో క్యాన్సర్ కేసులు దాదాపు రెండు మిలియన్ దాటుతాయని అంచనా వేసింది. వాస్తవానికి క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా కూడా ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆ వ్యాధి సైలెంట్ కిల్లర్ గా ప్రాణాలను హరిస్తోంది. అందువల్లే మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 19.3 మిలియన్ క్యాన్సర్ కేసులో నమోదయ్యాయి. ఇదే సమయంలో భారతదేశంలో రెండు మిలియన్ల కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి 2040 వరకు భారతదేశంలో క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల 57.5% ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఇక నేషనల్ క్యాన్సర్ మినిస్ట్రీ ప్రోగ్రాం ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతాయని గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ సంస్థ చెబుతోంది. ఇక పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అంటోంది.

మానవ మునగడకు ముప్పుగా పరిణమించిన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం మొట్టమొదటిసారిగా ప్యారిస్లో ఫిబ్రవరి 4, 2000 సంవత్సరంలో తొలిసారి సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ నిర్వహించడం, రోగులకు మెరుగైన సేవలు అందించడం, కాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పరిశోధనలను పెంచడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యాల వైపుగా ప్రపంచం కదులుతున్నప్పటికీ కొత్త కొత్త క్యాన్సర్ కేసులు వైద్య రంగానికి సవాల్ విసురుతున్నాయి. ఎన్ని రకాల పరిశోధనలు చేస్తున్నప్పటికీ మరణాలు సంభవించకుండా ఆగడం లేదు. అందుకే బయట ఆహారాన్ని పూర్తిగా మానేయటం.. మాంసాన్ని తక్కువగా తీసుకోవడం.. మద్యపానం, ధూమపానాన్ని పూర్తిగా మానేయడం.. శారీరక శ్రమ కలిగించే పనులు చేయటం.. ఆహారంలో కూరగాయలు ఎక్కువ తీసుకోవటం.. తాజా పండ్లు తినటం.. ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం పూర్తిగా మానేయడం.. ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోకపోవడం వంటి నియమాలు పాటిస్తే క్యాన్సర్ వ్యాధిని రాకుండా నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 35 దాటిన స్త్రీలు, పురుషులు మనం తప్పకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గటం, అకారణంగా పుట్టుమచ్చలు ఏర్పడటం, రక్తస్రావం కలగడం, కడుపులో మంట, ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉబ్బరం, మలం ద్వారా రక్తం పడటం.. వంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.