
IPL 2023 : ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఒక బౌలర్ చేసిన పనికి బీసీసీఐ ఏకంగా అరవై లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన ఆ బౌలర్ వలన పంజాబ్ విజయం సాధిస్తే.. బీసీసీఐ మాత్రం లక్షలాది రూపాయల నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నష్టం ఎందుకు వాటిల్లిందో..! ఏమిటా కథ..! చదివేయండి మీరు కూడా.
ఐపీఎల్ తాజా ఎడిషన్ లో శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ సిమ్రాన్ 17 బంతుల్లో 26 పరుగులు, టైడ్ 17 బంతుల్లో 29 పరుగులు, హర్ ప్రీత్ సింగ్ 28 బంతుల్లో 41 పరుగులు, కెప్టెన్ సామ్ కర్రన్ 29 బంతుల్లో 55 పరుగులు, జితేశ్ శర్మ ఏడు బంతుల్లో 25 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు 214 పరుగులు చేసింది. 215 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ధాటిగానే ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేయగా, కామరాన్ గ్రీన్ 43 బంతుల 67 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు, డేవిడ్ 13 బంతుల్లో 25 పరుగులు చేయడంతో లక్ష్యం దిశగా ముంబై ఇండియన్స్ కదిలింది. అయితే, చివర్లో తడబాటుకు గురి కావడంతో ముంబై ఓటిమి పాలు కావాల్సి వచ్చింది.
అద్భుత బౌలింగ్ తో విజయాన్ని అందించిన అర్షదీప్ సింగ్..
చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో బౌలింగ్ కు వచ్చాడు అర్షదీప్ సింగ్. క్రీజులో టీమ్ డేవిడ్, తిలక్ వర్మ ఉన్నారు. దీంతో ముంబై విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్టే కనిపించింది. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తొలి బంతికి టిమ్ డేవిడ్ సింగిల్ తీశాడు. మరుసటి బంతి డాట్ బాల్. ఆ తర్వాతి బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్షదీప్.. మిడిల్ స్టంపును విరగ్గొట్టాడు. మరుసటి బంతికే వధిరా (0) ను కూడా సేమ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. అప్పుడు కూడా మిడిల్ స్టంప్ విరిగిపోయింది. దీంతో ముంబైకి చివరి రెండు బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ఆర్చర్ కు మరో డాట్ బాల్ వేశాడు అర్షదీప్. చివరి బంతికి కేవలం సింగిల్ వచ్చింది. దీంతో ముంబై జట్టు 201 పరుగులు మాత్రమే చేసి 13 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.
బీసీసీఐకి తప్పని నష్టం..
అర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ తో పంజాబ్ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే బీసీసీఐకి మాత్రం అర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ తో నష్టం వాటిల్లింది. చివరి ఓవర్ లో రెండు వికెట్లను యార్కర్ల ద్వారా విరగ్గొట్టాడు అర్షదీప్ సింగ్. ప్రస్తుతం ఐపీఎల్ తో పాటు, క్రికెట్ లో జింగ్ బెయిల్స్ వికెట్లు వాడుతున్నారు. ఈ వికెట్ లు చాలా ఖరీదైనవి. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు 40 వేల డాలర్లు. అంటే రూ.30 లక్షలకు పైగా ధర పలుకుతుంది. ఈ లెక్కన ఒక్కో వికెట్ రేటు రూ.10 లక్షలు. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో అర్ష దీప్ సింగ్ రెండు వికెట్లు విరగగొట్టడంతో.. బీసీసీఐకు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. అదే కనుక ఈ రెండు వికెట్ సెట్లు మార్చేయాల్సి వస్తే.. అరవై లక్షలు నష్టం వాటిలినట్లే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఈ విరిగిన వికెట్లను అర్ష దీప్ కు ఇచ్చి పంపించారు. దీని గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.