Sleep Apnea: ఆహారం, సె*** తర్వాత మనిషికి అత్యంత అవసరమైనది నిద్ర. ఒక మనిషి పడుకునే సమయాన్ని బట్టి అతని ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. ఒక ఆరోగ్యవంతమైన మనిషికి 8 గంటల నిద్ర అవసరం. ఆ నిద్ర సరిగా లేకుంటే వివిధ రకాల వ్యాధులు ముమ్మరిస్తాయి. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో చాలామంది అర్థరాత్రుల వరకు మేల్కొని ఉంటున్నారు. అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. దీనివల్ల దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇటీవల ఈ తరహా వ్యాధులతో బాధపడేవారు పెరిగిపోతున్నారని ఎఐజి ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఇటీవల ఏఐజి ఆసుపత్రిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఫర్ స్లీప్ అప్నియా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా అందులో పాల్గొన్న వైద్యులు తాము ఇటీవల చేసిన అధ్యయనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ” స్లీప్ అప్నియా బాధితులను గుర్తించేందుకు ఒక యూనివర్సల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాం. బాధితులను నిర్ధారించి, వారికి సరైన చికిత్స అందించడంలో ఈ పరీక్షలు సహాయపడతాయి. దేశవ్యాప్తంగా 600 కంటే తక్కువ స్లీప్ ల్యాబ్ లు ఉన్నాయి. ఇవి మరిన్ని అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. వాహనం నడిపే వ్యక్తి నిద్ర మత్తులో ఉంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి అనేక తీవ్రమైన పరిణామాలకు స్లీప్ ఆప్నియా దారితీస్తుంది” అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతికూల ప్రభావాలు
సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల దేహం అనేక రకాల ప్రతికూల ప్రభావాలకు గురి అవుతుంది. భారతదేశంలో ఐదు కోట్లకు మందికి పైగా ప్రజలు నిద్రకు సంబంధించిన స్లీప్ అప్నియా తో బాధపడుతున్నారు. దీనివల్ల మధుమేహం, నాడి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది నేత్ర సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అది మెదడు పైన ఒత్తిడి పెరిగేందుకు కారణమవుతోంది. అలా పక్షవాతం వచ్చి అంతర్గతంగా రక్తస్రావం జరుగుతుంది. చివరికి ఇది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతోంది. అందుకే స్మార్ట్ ఫోన్లు తక్కువ వినియోగించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఫర్ స్లీప్ అప్నియా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.. స్మార్ట్ ఫోన్ కు ప్రత్యామ్నాయంగా యోగా లేదా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఈత కొట్టడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుందని, అలాంటప్పుడు త్వరగా నిద్ర పడుతుందని వారు చెబుతున్నారు. సాయంత్రం పూట వాకింగ్ చేయాలని, అప్పుడు శరీరం అలసటకు గురయి త్వరగా నిద్ర పట్టేస్తుందని పేర్కొంటున్నారు.