
Mahashivratri 2023: శివరాత్రి వచ్చిందంటే చాలు అందరూ జాగారం చేస్తారు. ఉదయం నుంచి శివుడి కళ్యాణం పూర్తి అయ్యేదాకా కడుపును ఖాళీగా ఉంచుతారు. తక్షణ శక్తి కోసం కందమూలాలు తింటారు.. వాస్తవానికి శివరాత్రి రోజుల్లోనే కందమూలాలు కనిపిస్తాయి. కంద మూలాలకు సంబంధించి దుంపలు ఎప్పుడు నాటినా అవి శివరాత్రికి మాత్రమే కోతకు వస్తాయి. ఇది శివుడి లీల అని చాలామంది నమ్ముతారు.
పురాణ కాలంలో రుషులు అడవుల్లో కందమూలాలు తిని జీవించేవారని గ్రంథాలు చెబుతున్నాయి. కంద మూలాలు అంటే దుంప కూరలు. వీటినే గడ్డలు అని కూడా పిలుస్తుంటారు.. కంద, చిలగడ, పెండలం, చేమ, బంగాళా, క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి.. వీటినే కందమూలాలు అంటారు. పెండలం, కర్ర పెండలం లాంటివి ఉన్నప్పటికీ అవి మనకు మార్కెట్లోకి పెద్దగా రావడం లేదు. ఇక అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి కూడా దుంప కూరల్లోకి వస్తాయి.. ప్రస్తుతం మనకు దొరుకుతున్న దుంప కూరల్లో చాలా మటుకు అవి మనవి కాదు. పోర్చుగీస్ కాలంలో మనకు సంక్రమించాయి.
పురాణాల ప్రకారం శివుడు తపస్సు చేసినప్పుడు యోగముద్రలో ఉండేవాడని, ఆ తపస్సు విడిచిన తర్వాత ఈ కందమూలాలు తినేవాడని తెలుస్తోంది. ఈ కందమూలాల్లో ఉన్న పోషకాలు శివుడికి తక్షణ శక్తిని ఇచ్చేవని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి సందర్భంగా తన భక్తులు జాగారం ఉంటారు కనుక, వారికి తక్షణ శక్తి ఇచ్చేలా కందమూలాలకు శివుడు పరమిచ్చాడు. ఏ కాలంలో పంట వేసినప్పటికీ తన శివరాత్రి వరకు కోతకు వచ్చేలా అభయం ఇచ్చాడు. ఆయన ఇచ్చినట్టుగానే కందమూలాలు సరిగా శివరాత్రికి ముందే కోతకు వస్తాయి. ఆధునిక వైద్యశాస్త్ర పరంగా కూడా కందమూలాలకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. పురాణ కాలంలో వానప్రస్థ ఆశ్రమం గడుపుతున్న రుషులు సంపూర్ణ ఆహార పదార్థాలుగా కందమూలాలను ఉపయోగించారు.. అందువల్లే వారు రోజుల తరబడి ఆకలి లేకుండా గడిపే వాళ్ళని తెలుస్తోంది.

ఇక కందమూలాలను తక్షణ శక్తి కేంద్రాలుగా పిలుస్తూ ఉంటారు. వీటిలో ఉన్న కార్బోహైడ్రేట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. రక్తపోటు పెరగకుండా కాపాడుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను సమపాలల్లో అందజేస్తాయి. గర్భవతులకు కలిగే అంతర్గత బాధలు తగ్గిస్తాయి. ఎసిడిటిని తగ్గించి, శరీరాన్ని తెలిక పరుస్తాయి. అంతేకాదు స్త్రీలలో కలిగే తెల్ల బట్టను నయం చేస్తాయి. మెనోపాజ్ సమీపించేటప్పుడు స్త్రీల ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుతాయి.. ఇక శివరాత్రి వచ్చినప్పుడు భక్తులు జాగారం సమయంలో కందమూలాలు తినేందుకు ఇష్టపడతారు.. దీనివల్ల ఆకలి అనిపించదు. శరీరం నీరసానికి గురికాదు.. తక్షణ శక్తి లభిస్తుంది