Monkey Trap: తన్మయత్వం చెందని బాల్యం.. అనుభూతులు పెంపొందించుకొని యవ్వనం.. ప్రేమను పొందలేని మధ్యస్థం.. జ్ఞాపకాలు పెనవేసుకోలేని వృద్ధాప్యం.. ఇలాంటివి ఏ మనిషి జీవితంలో ఉండకూడదు. చైనాలో ప్రాచుర్యం పొందిన సామెత ఇది. దీన్ని లాటిన్ అమెరికాలో వాళ్ల పరిభాషలో చెప్పాలంటే మంకీ ట్రాప్ అంటారు. అంటే ఒక మనిషి స్వేచ్ఛగా జీవించలేనప్పుడు.. తన జీవితంలో ప్రతిదానికి పరుగులు తీసినప్పుడు అతడు కచ్చితంగా మంకీ ట్రాప్ లో పడ్డట్టే.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. మనలో నూటికి 99 శాతం మంది ఇలాంటి మంకీ ట్రాప్ లో పడ్డవాళ్లే.. పడుతున్న వాళ్లే. మంకీ ట్రాప్ అనేది యముడు విధించే శిక్ష కాదు. మనకు మనమే విధించుకుంటున్న శిక్ష.
ఆఫ్రికా ఖండంలో ఓ తెగ వారికి కోతులను పట్టుకోవడం తెగ సరదా. వాటిని పట్టుకొని రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఆ విన్యాసాలు చూసిన విదేశీయులు వారికి డబ్బులు ఇస్తుంటారు. అయితే ఆ ఆఫ్రికా తెగ వారు కోతులను పట్టుకోవడంలో చూపించే నైపుణ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చెట్టుకు చిన్న రంధ్రం చేస్తారు.. ఆ రంధ్రం కోతి పిడికిలి పట్టేంత మాత్రమే ఉంటుంది. ఆ రంధ్రంలో కొన్ని వేరుశనగలు లేదా ఇతర ఆహార ధాన్యాలు పోస్తారు. వాటి ఆశ కోసం కోతులు అందులో చేయి పెడతాయి. ఆ చేయి ద్వారా పిడికిలి బిగించి ఆ ఆహార ధాన్యాలను అందులో బంధిస్తాయి. ఇక ఆ పిడికిలి ఆ రంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు. తీగ ఆ కోతి అరుపులు విన్న ఆ ఆఫ్రికన్ దేశస్తులు వెంటనే దాన్ని బంధిస్తారు. తమ వెంట పట్టుకుపోతారు. అ పిడికిలి అందులో ఇరుక్కుపోయి.. అందులో నిండుగా ధాన్యం ఉన్నప్పటికీ కోతి తినలేదు. తనను పట్టుకోవడానికి మనుషులు వస్తున్నప్పటికీ పారిపోలేదు. దీనినే స్థూలంగా చెప్పాలంటే మంకీ డ్రాప్ అంటారు.
మనలో చాలామంది ఈ మంకీ ట్రాప్ లో పడ్డ వాళ్ళే. కొత్తగా పడుతున్న వాళ్ళే. అయితే ఇందులో పడ్డవాళ్ళు కొత్తవారికి చెప్పలేరు. మంకీ ట్రాప్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని చూసి కూడా కొత్తవాళ్లు అందులోకి వెళ్ళకుండా ఉండలేరు. ఎందుకంటే అది ఒక ఊబి లాంటిది. మనలో చాలామందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. కోరికలుంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో చాలా దూరం పరిగెడుతుంటారు. ఏడిపించే జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. లేదు అని చెప్పలేని మొహమాటలను వెనకేసుకుంటారు. తిరిగి అడగలేని అప్పులను జమ చేసుకుంటారు. దండించలేని ప్రేమలను పెంచుకుంటారు. ఊపిరి సలపని పనులను పెట్టుకుంటారు. ఒత్తిడి పెంచే కోరికలను చుట్టూ చేర్చుకుంటారు. ఆరోగ్యాన్ని హరించే సంపాదనలను ఆర్జిస్తారు. పేరు కోసం దౌడు తీస్తారు. ఇవన్నీ జీవన పోరాటంలో చాలా సింపుల్ అనిపించినప్పటికీ.. ఇవేవీ మనిషి జీవితాన్ని గొప్పగా సార్ధకం చేయవు అంటుంటారు తత్వవేత్తలు. దీనికి స్థూలంగా వారు పెట్టిన పేరు మంకీ ట్రాప్.. అందుకే దీని వెంట పరుగులు తీయొద్దని.. గెలిచామని విర్రవీగొద్దని.. ఓడిపోయామని బాధపడద్దని.. దేన్నైనా సరే సులభంగా తీసుకోవాలని.. అప్పుడే జీవితాన్ని పరిపూర్ణంగా జీవించవచ్చని చెబుతున్నారు. స్వేచ్ఛగా జీవించినప్పుడే ఆరోగ్యం బాగుంటుందని.. ఆ ఆరోగ్యం బాగుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని వారు గుర్తు చేస్తున్నారు. చివరిగా జీవితమంటే జిందగీ నా మిలే దోబారా.. అంతే అంతకుమించి ఏమీ లేదు.