Virat Kohli: ఫార్మాట్ ఏదైనా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది.

కోహ్లీ బలహీనతలపై మంచి హోమ్ వర్క్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్.. అతడు క్రీజులోకి రాగానే సెకండ్ స్లిప్ ఫీల్డర్‌ను తీసుకొచ్చాడు. కేన్ మామ వ్యూహానికి తగ్గట్లు బౌలర్ జాన్సెన్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కోహ్లీ.. మిడాఫ్ దిశగా డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా సెకండ్ స్లిప్ చేతిలోకి వెళ్లింది. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే కోహ్లీ ఇలా అయిపోయాడేంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇతడేనా అని ప్రశ్నిస్తున్నారు. ఏ ఫార్మాట్‌లో అయినా కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్లు దాటుతోంది. ఐపీఎల్ ముందు వరకు కనీసం సెంచరీ చేయకపోయినా ఓ మాదిరిగా అన్నా ఆడుతున్నాడులే అని ఫ్యాన్స్ నచ్చచెప్పుకున్నారు.

కానీ ఈ ఐపీఎల్‌లో కోహ్లీ ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. గత నాలుగు మ్యాచ్‌ల ప్రదర్శనను చూస్తే సీఎస్‌కేపై ఒక్క పరుగు, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగులు చేయగా.. లక్నోపై డకౌట్, సన్‌రైజర్స్‌పై డకౌట్ అయ్యాడు. అంటే గత నాలుగు మ్యాచ్‌లలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ ఇలా వరుసగా రెండోసారి గోల్డెన్ డకౌట్ కావడం అతడి 14 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌లో ఇదే తొలిసారి.
Also Read:Trisha: అప్పుడు స్టార్లకే బిల్డప్ ఇచ్చింది, ఇప్పుడు ఐటమ్ కే ప్రాధేయపడుతుంది !