
IPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. స్మృతి మందాన కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఆ జట్టు గెలుపు ఒడ్డున పడలేకపోతోంది. ఇక బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ గెలుపు బోణీ చేసింది.. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సోఫియా డంక్లీ (28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), హర్లీన్ డియోల్ (45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 67) అదిరే హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన వేళ.. గుజరాత్ 11 పరుగులతో బెంగళూరుపై గెలిచింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. శ్రేయాంక, హీదర్ నైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 190/6 స్కోరుకే పరిమితమైంది. సోఫీ డివైన్ (45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), ఎలీస్ పెర్రీ (32), హీదర్ నైట్ (30 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేక పోయారు. ఆష్లే గార్డ్‌నర్ 3 వికెట్లు దక్కించుకొంది.
మంధాన కు ఏమైంది?
గుజరాత్ విధించిన భారీ ఛేదనలో ఓపెనర్లు స్మృతి మంధాన (18), సోఫీ డివైన్ పవర్‌ప్లేలో వేగంగా ఆడడంతో 5 ఓవర్లలో బెంగళూరు స్కోరు 50 దాటింది. అయితే, ఆరో ఓవర్‌లో మంధాను ఆష్లే అవుట్ చేసిన తర్వాత పరుగుల వేగం మందగించింది. డివైన్, పెర్రీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరుబోర్డును నడిపించడంతో 10 ఓవర్లకు బెంగళూరు 82/1తో నిలిచింది. కీలక సమయంలో పెర్రీని మాన్సీ జోషి వెనక్కిపంపింది. విజయానికి చివరి 5 ఓవర్లలో 77 రన్స్ కావాల్సిన సమయంలో రిచా ఘోష్ (10), డివైన్ అవుటైనా.. హీదర్ భారీషాట్లతో విరుచుకుపడడంతో లక్ష్యం వేగంగా కరిగింది. చివరి ఓవర్‌లో గెలుపునకు 24 పరుగులు అవసరమవగా..అనబెల్ సదర్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మంధాన సేనకు ఓటమి తప్పలేదు.
వీర లెవెల్ బ్యాటింగ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న గుజరాత్.. డంక్లీ, హర్లీన్ సూపర్ బ్యాటింగ్‌తో భారీస్కోరు చేసింది. మేఘన (8) స్వల్పస్కోరుకే వెనుదిరిగింది.. మరో ఓపెనర్ డంక్లీ భారీ షాట్లతో స్కోరు బోర్డు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ప్రీతి వేసిన 5వ ఓవర్‌లో 4 ఫోర్లు, సిక్స్‌తో 23 పరుగులు రాబట్టిన సోఫియా 18 బంతుల్లోనే ఫాస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ 64/1తో నిలిచింది. అయితే, 8వ ఓవర్‌లో శ్రేయాం క బౌలింగ్‌లో డంక్లీ అవుటవడంతో.. రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఆష్లే (19)తో కలసి 53 పరుగులు జోడించిన హర్లీన్‌ను ఆఖరి ఓవర్‌లో శ్రేయాంక బౌల్డ్ చేసింది. సుష్మ (5 నాటౌట్) ఫోర్‌తో స్కోరు బోర్డును 200 మార్క్ దాటించింది. ఇక కీలక సమయంలో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేయడంతో మందాన సేనకు ఓటమి తప్పలేదు. మొత్తంగా ఈ ఓటమితో బెంగళూరు జట్టు హ్యాట్రిక్ సాధించింది.