UIDAI Aadhaar Update : ఆధార్ కార్డు.. ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన డాక్యుమెంట్. హోటల్ గదులు బుక్ చేసుకోవాలన్నా, ఆస్తులు రిజిస్టర్ చేయించుకోవాలన్నా, లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా… ఇలా ప్రతిచోటా ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వడం కామన్. అయితే, ఈ పాత పద్ధతికి స్వస్తి పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ డేటాను మరింత సురక్షితంగా, సులభంగా పంచుకునేలా ఒక లేటెస్ట్ మొబైల్ యాప్‌ను తీసుకురాబోతోంది. ఇది వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడడం కూడా కీలక పాత్రను పోషిస్తుంది.
UIDAI త్వరలో రిలీజ్ చేయనున్న ఈ మొబైల్ యాప్.. ఆధార్ వినియోగాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ పూర్తి ఆధార్ వివరాలను లేదా ‘మాస్క్డ్ ఆధార్’ అంటే చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే ఆధార్‌ను కూడా క్యూఆర్ కోడ్ (QR Code) రూపంలో అవసరమైన సంస్థలతో షేర్ చేసుకోవచ్చు. అంటే, మీరు మీ పూర్తి ఆధార్ నంబర్ ఇవ్వకుండానే, అవసరమైన చోట మీ గుర్తింపును కన్ఫాం చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సేవలను అందించే సంస్థలు మీ వివరాలను సురక్షితంగా కన్ఫాం చేసుకుంటాయ. ఇప్పటికే ఉన్న mAadhaar యాప్ మరింత మెరుగై ఈ ఫీచర్లను అందిస్తుందా, లేదా కొత్త యాప్ వస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా డిజిటల్ భవిష్యత్తుకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు.
ఈ మార్పు వల్ల ఆధార్ జిరాక్స్ కాపీల దుర్వినియోగాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జిరాక్స్ కాపీలు ఇవ్వడం వల్ల జరిగే ఫోర్జరీలు, మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నకిలీ ఆధార్ పత్రాల వాడకాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, రైళ్లలో ప్రయాణీకుల గుర్తింపు చెకింగ్స్ కూడా ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి మరింత వేగవంతం చేస్తుంది. మీ వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోవాలనేది ఈ యాప్ సాయంతో మీ చేతుల్లో ఉంటుంది.
నవంబర్‌లో UIDAI మరొక ముఖ్యమైన మార్పును తీసుకురానుంది. ఇక మీదట మీ ఆధార్‌లోని అడ్రస్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు చిన్న మార్పుల కోసం కూడా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ గుర్తింపులు అవసరం అయినప్పుడు మాత్రమే ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కారణంగా ప్రజల సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల వద్ద రద్దీని గణనీయంగా తగ్గుతుంది.
ఈ కొత్త వ్యవస్థల వల్ల మోసాలను నివారించడంతో పాటు, ఆధార్ సంబంధిత ప్రక్రియలన్నీ మరింత వేగవంతంగా మారతాయి. పేపర్ లెస్ ట్రాన్సాక్షన్లు పెరుగుతాయి. బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , పాన్ కార్డ్, ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ వంటి ఇతర ప్రభుత్వ డేటా రికార్డుల నుంచి నేరుగా సమాచారాన్ని పొందే ఏర్పాట్లను కూడా UIDAI చేస్తోంది.