TS EAMCET 2023: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆప్షన్లు ఇచ్చే గడువు బుధవారం ముగిసింది. ఈ నెల 16న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తొలి దశలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సీట్లు పెరగడం, సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తాయని భావించడంతో ఎక్కువ మంది ఈ కోర్సును ఎంచుకున్నారు.
కంప్యూటర్ కోర్సులకే ఎక్కువ..
విద్యార్థులు మొత్తం 49,42,005 ఆప్షన్లు ఇవ్వగా, వీటిలో 38 లక్షల వరకూ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3,777 సీట్లు ఉంటే, విద్యార్థుల నుంచి 10 లక్షలకు మించి ఆప్షన్లు రాలేదు. గడువు ముగిసే నాటికి మొత్తం 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఒకే విద్యార్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఇచ్చారు. వాస్తవానికి 12వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పొడిగించారు.
ప్రైవేటుపై ఆసక్తి చూపని ర్యాంకర్లు..
తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్లో ఎక్కువ ర్యాంకులు పొందిన వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు అతి కొద్ది ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల క్యాంపస్ పరిధిలో ఉండే సీట్లకు పోటీ పడ్డారు. 500 ర్యాంకు దాటిన వారు మాత్రం టాప్ టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. ఎంసెట్లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులు తొలి కౌన్సెలింగ్లో 500లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా ర్యాంకర్ల చేతే దరఖాస్తు చేయించి, సీటు వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ సమయంలో రద్దు చేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం దీనిపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి.. జాతీయ ఇంజినీరింగ్ కాలేజీల్లో వారు పొందిన సీట్ల వివరాలు తెప్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. దీంతో సీట్లను బ్లాక్ చేసే యాజమాన్యాలకు సహకరించేందుకు విద్యార్థులు వెనకడుగు వేశారు.
క్యాంపస్ కోసమే పోటీ..
ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఉండే సీట్ల కోసమే ర్యాంకర్లు పోటీపడ్డారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 2,580, కాకతీయ పరిధిలోని 1,080 సీట్లతో కలుపుకొని రాష్ట్రంలోని 9 వర్సిటీల పరిధిలో మొత్తం 4,773 సీట్లున్నాయి. వీటికే టాపర్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు.
తొలి విడతలో 76,359 సీట్లు
ఈ ఏడాది సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. 7 వేల వరకూ సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లో తగ్గించుకున్న కాలేజీలు, ఆ మేర కంప్యూటర్ బ్రాంచీల్లో పెంచుకున్నాయి. దీంతోపాటు అదనంగా మరో 7 వేల వరకూ సీఎస్సీలో సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి విడత కౌన్సెలింగ్లో 76,359 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 42,087 సీట్లు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీల్లో ఉన్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More