OCD: మనలో కొందరు చేసే పనులే తరచు చేస్తుంటారు. ఒకటికి రెండు సార్లు సరి చూసుకుంటారు. సరిగా చేశామో లేదో అని పరీక్షించుకుంటారు. దీంతో పనుల్లో ఆలస్యం అవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) అని పిలుస్తుంటారు. ఈ మేరకు ఆశా హాస్పిటల్ డైరెక్టర్, సీనియర్ సైకియట్రిస్ట్ డాక్టర్ మండాది గౌరీదేవి కొన్ని విషయాలు వెల్లడించారు. దీంతో బాధపడే వారి లక్షణాలు, అలవాట్ల గురించి వివరించారు. ఒక పనిని పదేపదే చేస్తుంటారని చెబుతున్నారు.

ఓసీడీతో బాధపడేవారు విపరీత ధోరణి కలిగి ఉంటారు. తమ ప్రమేయం లేకుండానే వారి మనసులోకి పలు రకాల ఆలోచనలు వస్తుంటాయి. దీంతో ఎటైనా వెళ్లేటప్పుడు ఇంటి తాళం వేసుకున్నామో లేదో అని రెండు సార్లు పరీక్షించుకుంటారు. అలాగే గ్యాస్ కట్టేశామా లేదా అని తరచుగా చెక్ చేసుకోవడం వీరికి అలవాటు. దీంతో వారి మానసిక స్థితి సరిగా లేదనే విషయం అర్థమవుతుంది. సాధారణంగా రెండు శాతం ప్రజలు ఓసీడీతో బాధపడుతుంటారు. ఓసీడీ సహజంగానే వస్తోంది. దీనికి కారణాలంటూ ఏమీ ఉండవు.
ఓసీడీ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. ఒకరిలో స్నేహితులపై దాడి చేయాలనే భావన కలగడం సహజమే. మరొకరికి తమ భర్త ముఖంపై దిండుతో దాడి చేసి చంపేస్తున్నాడనే ఆందోళన కలుగుతుంది. ఇంకా తమ బిడ్డ తనను చంపేస్తుందేమోనని బెంగ పట్టుకుంటుంది. దీంతో వారు అనవసరంగా భయపడుతూ ఉంటుంటారు. వారిలో అపోహలే ఎక్కువగా వస్తాయి. వారు ఏదో జరిగిపోతోందనే కోణంలో ఆతృత పడుతుంటారు. ఓసీడీ సమస్యతో బాధపడే వారికి నిలకడ ఉండదు.

వీరిలో మానసిక స్థితి సరిగా ఉండదు. ఎప్పుడు ఏదో ఆలోచనలతో రగిలిపోతుంటారు. తమ భవిష్యత్ నాశనం అయిపోతుందనే భయం వారిలో నెలకొంటుంది. దీంతో పరుష పదజాలం వాడుతూ ఎదుటి వారిని నిందిస్తుంటారు. అమ్మానాన్నలకు ఏదో అయిపోతున్నట్లు భ్రమ పడుతుంటారు. ఇంకా కొందరు దేవుడిని కూడా దూషిస్తుంటారు. తమ అదృష్టాన్ని లాగేసుకుంన్నాడని శాపనార్థాలు పెడుతుంటారు. ఇలా ఓసీడీతో బాధపడే వారి మనస్తత్వం భిన్నంగా ఉండటం సహజం. వారిలో వారే మాట్లాడుకుంటుంటారు. దీన్ని పోగొట్టుకోవడానికి వైద్యుల సలహాలు, సూచనలు, మందులు తీసుకుని సరైన చికిత్స తీసుకుంటే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.