Pawan Kalyan- BJP: ఎక్కడైనా ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా తలపడితే అందరి చూపు చిన్నాచితకా పార్టీలపై పడుతుంది. ఎందుకంటే ఓటు షేరింగ్ తో అధికారానికి అమడ దూరంలో రాజకీయ పార్టీలు ఉండిపోతాయి.పెద్ద పార్టీలుగా అవతరించినా అధికారాన్ని అందిపుచ్చుకోలేవు. అప్పుడు తక్కువ సీట్లు వచ్చిన పార్టీలే కీలకంగా మారాతాయి. ఒక్కోసారి చిన్న పార్టీలకే అధికారం చేపట్టే చాన్స్ వస్తుంది. చాలాసార్లు ఇదే ప్రూవ్ అయ్యింది. కర్నాటకలో కుమారస్వామి, బిహార్ లో నితీష్, మహారాష్ట్రలో ఉద్దవ్ ఇలానే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. సీట్లపరంగా వెనుకబడినా సీఎం పీఠాన్ని అధిష్టించగలిగారు. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే ఆవిష్కృతమవుతుందన్న టాక్ అయితే ఒకటి నడుస్తోంది.

ఏపీలో వచ్చే ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. టీడీపీ, జనసేన కలిసే నడుస్తాయన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీని కలుపుకొని పోవాలన్న తలంపుతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే కలవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలవడం కేంద్ర పెద్దలకు ఇష్టం లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు హంగ్ దిశగా వచ్చే అవకాశముందని.. అత్యధిక సీట్లు పొందే వైసీపీ, టీడీపీలో ఏదో ఒక పక్షం బీజేపీ, జనసేన కూటమికి సపోర్టు చేయడం అనివార్యంగా మారుతుందని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అప్పుడు సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ కు చాన్స్ వస్తుందని బీజేపీ పెద్దలు హితబోధ చేసినట్టు సమాచారం.
బీజేపీ, జనసేనకు సంస్థాగత బలం లేదు. పవన్ కు క్లీన్ ఇమేజ్ తో పాటు ప్రజాదరణ ఉంది. కానీ దానిని ఓట్లుగా మలిచే సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఒక లోటు. అయితే అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి సంస్థాగత బలం ఉంది. అందుకే రెండోసారి అధికారంలోకి రావడానికి జగన్.. ఎలాగైనా జగన్ ను గద్దె దించి అధికార పీఠాన్ని అందుకోవాలని చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. ఇది ఎన్నికల నాటికి మరింత తీవ్రమవుతుంది. టీడీపీ కూడా తన బలం పెంచుకుంటుంది.దీనినే బీజేపీ నేతలు సరికొత్తగా విశ్లేషిస్తున్నారు. వైసీపీ, టీడీపీ హోరా హోరీగా తలపడే క్రమంలో ఓటు షేరు క్రాస్ అవుతుంది. ఆ సమయంలో కానీ బీజేపీ, జనసేన కూటమి నిలబడితే కనీసం 175 స్థానాల్లో 40 స్థానాలను కైవసం చేసుకునే అవకాశముంది. మిగతా స్థానాలను టీడీపీ, వైసీపీ చెరి సగం పంచుకున్నా.. బీజేపీ, జనసేన కూటమే నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశముందని కేంద్ర పెద్దలు అంచనా వేస్తున్నారు. అప్పుడు ఇతర రాష్ట్రాల ఫార్ములా ప్రకారం పవన్ సీఎం అయ్యే చాన్స్ వస్తుందని లెక్కలు కడుతున్నారు.

ఎన్నికలకు ఇంకా 15 నెలల వ్యవధి ఉండడంతో బీజేపీ, జనసేన కూటమి ఏపీలో బలోపేతం అయ్యేలా చూడాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏపీ పై ఫోకస్ పెట్టారు. వీలున్నప్పుడల్లా ఏపీలో పర్యటించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్నికల సమయానికి భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేసి కూటమిని మరింత చైతన్యం తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి సీఎం క్యాండిడేట్ గా పవన్ ను దించితే మాత్రం అంచనా కచ్చితంగా నిజమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 175 స్థానాల్లో నిర్థిష్టంగా 40 నియోజకవర్గాలపై ఫోకస్ పెడితే మాత్రం వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ, జనసేన కూటమి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం, పవన్ సీఎం అవ్వడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు. అయితే ఈ ఫార్ములా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.