Mandatory Documents: రోడ్డుపైన వాహనాలు నడిపేవారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది చేతిలో బైక్ ఉండగానే ఎంతో సంబరపడుతూ ముందుకు వెళ్తారు. బైక్ నడపొస్తే చాలు తాము ఎంత దూరమైనా వెళ్లాలని అనుకుంటారు. కానీ ద్విచక్ర వాహనం లేదా ఫోర్ వీలర్ వాహనం నడపాలంటే లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకున్న తర్వాతనే వాహనం నడిపే ప్రయత్నం చేయాలి. లేకుంటే జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష కూడా అనుభవించే ప్రమాదం ఉంటుంది. అయితే కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా బైక్ తో ఈ పత్రాలను కూడా కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇంతకు ఎలాంటి పత్రాలు ఉండాలంటే?
చాలామంది వాహనాలు రోడ్డుపై నడపేవారు తమ వెంట ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బైక్ నడిపే ప్రతి ఒక్కరూ బైక్ కు సంబంధించిన ధ్రువపత్రాలు కచ్చితంగా ఉండాలి. వీటిలో మొదటిది వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు. అయితే ఈ పత్రాలు ఇప్పుడు పివిసి కార్డు రూపంలో ఇస్తున్నారు. ఈ కార్డు పర్సులో పెట్టుకున్న చాలు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా పీవీసి కార్డు రూపంలో ఇస్తున్నారు. వీటితోపాటు ఇన్సూరెన్స్ తీసుకున్న పత్రాలు కూడా ఉండాలి. అలాగే వాహనానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి. ఇన్సూరెన్స్ లేదా పొల్యూషన్ సర్టిఫికెట్ ఏడాది లేదా 6 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు మార్చుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఫోర్ వీలర్ లేదా కమర్షియల్ వాహనం అయితే పర్మిట్ సర్టిఫికెట్ తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ వాహన స్థితిగతులను తెలుపుతుంది.
అయితే ఈ సర్టిఫికెట్ చాలామంది ఇంటి నుంచి తీసుకువెళ్లే క్రమంలో మర్చిపోతూ ఉంటారు. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలనుకుంటే digilocker లో ఈ సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేసుకొని ఉండాలి. ఒక్కోసారి ఇంటి నుంచి సర్టిఫికెట్లు మర్చిపోయినా.. ఈ యాప్ ద్వారా అధికారులకు చూపించే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా డిజి లాకర్లో మిగతా ధ్రువీకరణ పత్రాలను కూడా స్టోర్ చేసుకోవచ్చు.
అయితే వాహనం నడిపేవారు సరైన ధ్రువపత్రాలు లేకుంటే పోలీసు అధికారుల నుంచి జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.1000 వరకు జరిమానా వేస్తారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే రూ.500 జరిమాన వేస్తారు. అయితే ఇది ఒకరోజు మాత్రమే. ఆ తర్వాత రోజు కూడా చూపించకపోతే జరిమానా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. వాహనానికి ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోతే రూ.1000 నుంచి రూ.4000 జరిమానా విధించే అవకాశం ఉంది. ఫోర్ వీలర్ అయితే జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది. అందువల్ల వాహనం నడిపేటప్పుడు సరైన పత్రాలు కచ్చితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.