Gender Equality: వారసుడు.. కచ్చితంగా మగవాడే కావాలి. మగవాడు మాత్రమే వారసుడిగా ఉండాలి. ఇలానే ఉండేది తల్లిదండ్రుల ధోరణి. పైగా మగవాళ్ళ మీద విపరీతమైన ప్రేమతో ఆడవాళ్ళ మీద వేధింపులు ప్రారంభించే వారు. ఆడవాళ్లు కేవలం అత్తింటికి మాత్రమే పరిమితం అవుతారని.. అందువల్లే వారికి వీలైనంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని చాలామంది అనుకునేవారు.
రాను రాను సమాజంలో మార్పు వస్తోంది. ఆడపిల్లల్ని కూడా వారసులుగా భావిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతుంది. గడచిన కొంతకాలంగా ఆడవారి సంఖ్య పెరిగిపోవడంతో సమాజంలో లింగ అసమానత పెరిగిపోయింది. దీంతో చాలామంది అబ్బాయిలు వివాహాలు కాకుండానే ఉండిపోతున్నారు. వివాహమైతే చాలు కట్నాలు, కులాల ప్రస్తావన అవసరం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమందికి ఇప్పటికీ వివాహం జరగడం లేదు.
సమాజంలో ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళ మీద ఆంక్షలు తగ్గిపోతున్నాయి. మగవాళ్ళ మాదిరిగానే వారిని కూడా తల్లిదండ్రులు పెంచుతున్నారు. వారికి అన్ని రంగాలలో స్వేచ్ఛ ఇస్తున్నారు. చదువు నుంచి మొదలు పెడితే ఉద్యోగం వరకు ప్రతి విషయంలోనూ వారి అభిప్రాయానికి విలువ ఇస్తున్నారు. తద్వారా ఆడవాళ్లు కూడా అన్ని రంగాలలో మగవాళ్లకు మించి ప్రతిభను చూపుతున్నారు. ఆర్మీ నుంచి మొదలుపెడితే అరణ్యం దాకా.. ఆకాశం నుంచి మొదలుపెడితే సముద్ర జలాల వరకు ఇలా అన్ని రంగాలలో ఆడవాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
అయితే వారసుల విషయంలో కూడా తల్లిదండ్రుల ధోరణి పూర్తిగా మారిపోతుంది. వారసులుగా మగవాళ్ళ కంటే ఆడవాళ్లే బాగుంటారని తల్లిదండ్రులు బలమైన అభిప్రాయంతో ఉంటున్నారు. అందువల్లే ఆడపిల్లలకు జన్మనివ్వడానికి ముందుకు వస్తున్నారు. ఆడపిల్లలైతే బాధ్యతగా ఉంటారని.. ప్రేమను పంచుతారని.. వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని.. ఏదైనా అనారోగ్యం సోకితే సపర్యాలు చేస్తారని తల్లిదండ్రులు బలంగా నమ్ముతున్నారు. అందువల్లే ఆడపిల్లలకు జన్మనివ్వడమే కాదు.. వారసులుగా కూడా ప్రకటించుకుంటున్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయాలు సమాజంలో మారుతున్న తల్లిదండ్రుల ఆకాంక్షలను బలంగా చాటుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.