Deepavali Village: నోరు మంచిదైతే.. ఊరు మంచిది అంటారు. మనిషికి చిరునామా తల్లిదండ్రుల నుంచి సంక్రమించినా.. నిజమైన గుర్తింపు మాత్రం గ్రామం ద్వారా లభిస్తుంది. అయితే గ్రామాల పేర్లు రకరకాలుగా ఉంటాయి. వాటికి కూడా ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వెలుస్తున్న గ్రామాలు, కాలనీలకు అభిరుచులకు తగ్గట్టు పేర్లు పెడుతున్నారు.అయితే కొన్ని గ్రామాల పేర్లు మరీ వింతగా ఉంటాయి. ఇలా కూడా పెడతారా అన్న సందేహం, ఆశ్చర్యం కలుగక మానదు. ముఖ్యంగా ఏపీలో గ్రామాల వింతపేర్లు వినిపిస్తుంటాయి. అయితే పండుగల పేరిట ఉండే గ్రామాలు మాత్రం అరుదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో రెండు గ్రామాలుండడం ఆసక్తిగొలుపుతోంది. అలా దీపావళి పేరు రావడానికి గ్రామపెద్దలు రకరకాల కథనాలు చెబుతున్నారు. ఒక గ్రామానికి రాజు పేరు పెడితే.. మరో గ్రామానికి మాత్రం మూషికం వల్ల ఆ నామకరణం జరిగిందని అక్కడి వారు బదులిస్తున్నారు.

శ్రీకాకుళం నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దీపావళి అనే గ్రామం ఉంది. గార మండలంలో ఉండే ఈ గ్రామం కళింగపట్నం సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. పూర్వం కళింగరాజులు ఈ ప్రాంతాన్ని పాలించే వారు. నిత్యం ప్రజల బాగోగులను తెలుసుకునేందుకు గుర్రంపై స్వారీ చేస్తూ కళింగపట్నం వైపు వెళ్లేవారు. ఈ క్రమంలో దీపావళి నాడు రాజు వెళుతూ వెళుతూ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. ఆ మార్గంలోనే సృహ తప్పి పడిపోయారు. గమనించిన గ్రామస్థులు, స్థానికులు రాజుకు సపర్యలు చేశారు. కొంత సమయానికి తేరుకున్న రాజు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం పేరును ఆరాతీశారు. కానీ ఈ గ్రామానికి పేరు అంటూ లేదని చెబుతుండడంతో రాజు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ గ్రామానికి దీపావళిగా నామకరణం చేశారు. ప్రస్తుతం గ్రామంలో వెయ్యి కుటుంబాలు నివాసముంటున్నాయి. అన్ని పండుగల కంటే దీపావళి తమకు స్పెషల్ అంటూ గ్రామస్థులు చెబుతున్నారు. వంశధార నదీ తీరంలో ఉండే ఈ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. దీపావళి పండుగ వచ్చిందంటే ఊరంతా ఒకటే సందడి. దూరంలో ఉన్న బంధువులు, మిత్రులను పిలుసుకుంటారు. నరకాసుర వధను వేడుకగా జరుపుకుంటారు. దశాబ్దాలుగా ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారు.

గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరైన టెక్కలికి కూతవేటు దూరంలో దీపావళి పేట అనే గ్రామం ఉంది. చిన్నపాటి గ్రామంగా ఉన్నప్పుడు, 192030 మధ్య అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో నూనె దీపాన్ని ఎలుకలు తీసుకొచ్చి పూరిగుడిసెల వద్ద పెట్టడంతో మంటలు వ్యాపించి గ్రామమంతా కాలిపోయింది. దీంతో ఆ గ్రామానికి దీపాలపేటగా పేరు వచ్చింది. కాలక్రమేణా అది దీపావళి పేట అయ్యింది. రెవెన్యూరికార్డుల్లో అదే పేరుతో కొనసాగుతోంది. దీపావళి వచ్చిందంటే గ్రామంలో సందడి వాతావరణమే. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలు వెళ్లే వారు పండుగకు గ్రామానికి చేరుకుంటారు. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో వేడుకగా జరుపుకుంటారు. ఓ పండుగ పేరు గ్రామానికి ఉండడం తమ అదృష్టంగా ఇక్కడ వారు భావిస్తుంటారు.