Virat Kohli Emotional: విరాట్ కోహ్లీ.. సమకాలీన క్రికెట్లో ఇతడిలా ఆడాలంటే కష్టం. ఇతడిలా ఫిట్ గా ఉండాలంటే కూడా కష్టం. అతడు కొట్టని సెంచరీలు లేవు.. అతడు చేదించని టార్గెట్లు లేవు. ఎలాగైనా ఆడతాడు. ఎక్కడైనా ఆడతాడు. అతడు ఒక పరుగుల యంత్రం అంటే అతిశయోక్తి కాదు. వికెట్ల మధ్య అతడు పరిగెడుతుంటే మైదానంలో చిరుత పులి పరుగు తీసినట్టే కనిపిస్తుంది. బౌలర్లను నిర్దయగా బాదే విరాట్ మానవ మాతృడేనా అనే సందేహం కలుగుతుంది. ఎన్నో శతకాలు.. ఎంతోమంది బౌలర్లకు పీడకలలు..మేటి విజయాలు.. అనితర సాధ్యమైన రికార్డులు.. ఇంతటి చరిత్ర లిఖించాక.. ఇన్నేసి విజయాలు సాధించాక.. విరాట్ విజయ నాదమే చూశాం. కానీ ఎప్పుడైనా కన్నీరు పెట్టుకోవడం చూశామా? అతడి కళ్ళల్లో కన్నీరు ఉబికి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? కానీ అతడు ఏడ్చాడు. యావత్తు క్రికెట్ క్రీడా ప్రపంచాన్ని ఏడిపించాడు. బ్యాట్ తో వీర విహారం చేసే విరాట్.. ఎందుకు ఏడ్చాడు? అతడి గుండెల్లో గూడుకట్టుకున్న బాధ ఏంటి?

రెండు అంకెల స్కోరు కే పరిమితమయ్యాడు
విరాట్ కోహ్లీ మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు కొట్టేవాడు. సమకాలీన క్రికెట్ లో బ్రాడ్ మన్, సచిన్ తర్వాత అంతటి పేరు సాధించే అర్హత ఉన్న క్రీడాకారుడు. కానీ గత కొంతకాలం నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. 2016లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మ్యాచ్ ల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి చిరస్మరణీయ విజయం అందించాడు. అలాంటి కోహ్లీ రెండు అంకెల స్కోర్ వద్దే ఆగిపోతున్నాడు. దీంతో విమర్శలు ఎక్కువైపోయాయి. ఇక గంగూలీ బ్యాచ్ అయితే ట్రోలింగ్ మొదలుపెట్టింది. కొంతమంది వెదవలు అతడి కూతురిని కూడా వదిలిపెట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్ లో 11 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ.. రెండున్నర సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ లోనూ రెండు అంకెల స్కోర్ దాటలేదంటే అంతకంటే పతనం ఏముంటుంది? క్రికెట్ లో ఎవరికైనా ఫామ్ లేమితో బాధపడటం కామనే. అంతటి సచినే ఇబ్బంది పడ్డాడు. కానీ కోహ్లీ విషయంలో శతకం అటు ఉంచితే.. కనీసం 50 పరుగులైనా చేస్తే చాలు అనే స్థాయికి వచ్చాడు. ఎంతో మంది మేటి బౌలర్లకు చుక్కలు చూపించిన కోహ్లీ.. అనామక బౌలర్లకు కూడా తలవంచి నిస్సహాయంగా మైదానం వీడుతుంటే ఎంతోమంది క్రీడాభిమానులు ఆవేదన చెందారు. అప్పుడప్పుడు 50 పై చిలుకు పరుగులు చేసినా.. మునుపటి కసి కోహ్లీలో కనిపించలేదు.
ఎవరి వల్ల కానిది ఇతడు సాధించాడు
159 పరుగులు.. టి20 మ్యాచ్లో మరీ అంత పెద్ద స్కోరేమీ కాదు. కానీ ఆస్ట్రేలియా పిచ్ ల పై ఇది కంగారు పెట్టే స్కోరే. 26 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయాక ఇంకా ఆశలు ఏముంటాయి? పైగా పాక్ బౌలర్లు నిప్పులు చెరిగేలా బంతులు వేస్తుండడంతో 15 ఓవర్ల దాకా స్కోరు 100కే పరిమితం అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దశలో ఒకప్పటి మూలవిరాట్ బయటకు వచ్చాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు.

మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిస్ట్ హ్యాండ్ స్పెషలిస్ట్ కేఎల్ రాహుల్, బంగ్లాదేశ్ పై చిరస్మరణీయ విజయం అందించిన దినేష్ కార్తీక్.. వంటి వారు విఫలమైన చోట హార్దిక్ పాండ్యాతో కలిసి బలమైన ఇన్నింగ్స్ నిర్మించి.. అసాధ్యం కానీ విజయాన్ని సుసాధ్యం చేశాడు. గెలిచిన వెంటనే కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్లు కోహ్లీ అనుభవించిన బాధ ఆ స్థాయిలో ఉంది మరి. ఎన్నో సెంచరీలు సాధించినా కోహ్లీకి ఈ పరుగులు ఒక లెక్క కాకపోవచ్చు. కానీ 82 పరుగులు లేకుంటే జట్టు విజయం సాధించేది కాదు. 159 పరుగుల లక్ష్యంలో 82 పరుగులు అంటే మామూలు విషయం కాదు. అందుకే అందరూ ఒక ఎత్తు. కోహ్లీ ఒక ఎత్తు. కన్నీరు పెట్టుకున్నంత మాత్రానా సింహం ఏడ్చినట్టు కాదు. ఇన్నాళ్ళ ఒత్తిడిని జూలు విదిల్చినట్టు విధిల్చింది అంతే.! బరువును దించేసుకుంది అంతే!