Sankranti Recipes: సంక్రాంతి అంటేనే సకినాలు, మురుకులు,అరిసెలు, లడ్డూలు, గారెలు.. ఇవి లేకుండా సంక్రాంతి పూర్తికాదు.. ప్రారంభమే కాదు. వెనుకటి రోజుల్లో ఇవి ప్రతి ఇంట్లో ఉండేవి.. అమ్మ లక్కలు పండుగ మూడు నాలుగు రోజులు ముందు ఉందనగానే వీటి తయారీలో నిమగ్నమయ్యేవారు. ఒకరి ఇంట్లో పూర్తయిన తర్వాత మరొకరింట్లో చేసుకునేవారు.. సంక్రాంతికి ముందు నుంచి పండుగ వెళ్లినంక రోజుల దాకా ఇంటిల్లిపాది కరకరలాడించేవారు. పల్లెలోనే కాదు, సిటీల్లో కూడా చుట్టుపక్కల ఇండ్లలో ఉండే మహిళలంతా కలిసి ఒక ఇంటి తర్వాత ఇంకొకరి ఇంట్లో ఈ వంటకాలను తయారు చేసుకునే వాళ్ళు. కానీ, ఇప్పుడు సిటీ లైఫ్ లో క్షణం తీరికలేని పని ఒత్తిడి, పలకరింపులు కూడా సరిగ్గా లేని ఇరుగుపొరుగుతో… తలు ఆ పిండి వంటలు ఎట్లా చేస్తారో కూడా తెలియక రెడీమేడ్ పిండి వంటకాలను జనం ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటిని తయారు చేసి అమ్మే స్టోర్లకు మస్తు గిరాకీ వస్తోంది. హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లోనూ గల్లి గల్లికి పిండి వంటల దుకాణాలు వెలుస్తున్నాయి.

సంక్రాంతి, ఉగాది, హోలీ, దసరా, దీపావళి… ఇలా పండుగ ఏదైనా చాలా పల్లెల్లో ఇప్పటికీ సకినాలు, అరిసెలు, గారెలు, గరిజెలు, పోలెలు, చేగోళ్ళు పిండి వంటలు తయారు చేసుకుంటుండగా… చిన్నపాటి, పెద్ద పట్టణాల్లో మాత్రం ఇంట్లో చేసుకోవడం తగ్గిపోయింది. స్టోర్స్ మీదనే ఎక్కువమంది ఆధారపడుతున్నారు.. జనం టేస్ట్ కు తగ్గట్టుగా స్టోర్స్ వాళ్ళు పిండి వంటలను తయారు చేస్తున్నారు.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, మంచిర్యాల, అటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఇతర పట్టణంలోని పిండి వంటల షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు సకినాలతో సహా ఇతర పిండి వంటలను ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు.. సంక్రాంతి సందర్భంగా 15 రోజుల ముందుగానే ఆర్డర్ తీసుకొని విక్రయించారు.. మామూలు రోజుల్లో ఒక స్టోర్లో 20 కిలోల వరకు పిండివంటలు అమ్మితే… సంక్రాంతి ముందు రోజు నుంచి కనుమ దాకా 120 కిలోల వరకు పిండివంటలు విక్రయించారు.. ఇందులో 40 శాతం డోర్ డెలివరీలే. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 4000 వరకు స్వగృహ ఫుడ్స్, తెలంగాణ పిండివంటల తయారీ స్టోర్లు ఉన్నాయి. సకినాలు, గారెలు, మురుకులు, బెల్లం అప్పాలు, సున్ని ఉండలు, నువ్వుల ఉండలు వంటి పిండివంటలకు గిరాకీ ఎక్కువగా ఉందని స్వగృహ ఫుడ్స్ ఓనర్లు చెబుతున్నారు.

ఆర్డర్లు పెరిగాయి
రెడీమేడ్ పిండివంటలకు ఏటా గిరాకీ పెరుగుతోంది. మామూలు రోజులతో పోలిస్తే ప్రస్తుతం పదిరెట్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. పిండివంటలకు గిరాకీ బాగుండడంతో చాలామంది దీన్నే చాలామంది జీవనోపాధిగా మలుచుకున్నారు. నగర జీవితంలో ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకునే వాళ్ళు తగ్గిపోయి ఆన్లైన్ ఆర్డర్లకు డిమాండ్ ఎక్కువ అవుతున్నది. కస్టమర్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు తగ్గట్టుగా ఆర్డర్ల మీద రెడీ చేసి డెలివరీ ఇస్తున్నారు.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు కూడా డెలివరీ చేస్తున్నారు.. మామూలు రోజుల్లో క్షణం తీరిక లేకుండా వంటలు చేస్తూనే ఉండే నిర్వాహకులకు… పండగ సమయంలో ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండటం లేదు.. ఇక మరికొందరైతే ఇండ్లలో పిండి వంటలు తయారుచేసి ట్రాలీల్లో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమ్ముతున్నారు.