India vs England- Pakistan Fans: విజయం ఎంత కిక్ ఇస్తుందో.. పరాజయం అంత బాధిస్తుంది. క్రికెట్ ను బాగా ఆరాధించే మనదేశంలో ఆ అనుభవం క్రీడాకారులకు ఎక్కువ ఉంటుంది. 2003 వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓటమి తర్వాత.. భారత అభిమానులు క్రికెటర్ల దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. చాలాచోట్ల టీవీలు పగలగొట్టారు. అదే పాకిస్తాన్ పై విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేశారు. సేమ్ ఇటువంటి దృశ్యాలే పాకిస్తాన్లో కనిపించాయి. ఇక మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించిన నేపథ్యంలో ఆదేశ అభిమానులు భారత జట్టు క్రీడాకారులను కించపరుస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో అది ట్రెండింగ్ గా నిలిచింది.

టి20 వరల్డ్ కప్ లో
టి20 మెన్స్ వరల్డ్ కప్ లో టీం ఇండియా తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడింది. నువ్వా నేనా అనుకున్నట్టు సాగిన ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. దీంతో మన దేశ అభిమానులు రెచ్చిపోయారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ అభిమానులు చేసిన అతికి బదులు తీర్చుకున్నారు. భారత అభిమానుల దెబ్బకు తృతంలో అది వారం పాటు ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈరోజు అడిలైడ్ లో జరిగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన పరాజయాన్ని చూసింది. 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేసింది. భారత బౌలర్లు గల్లి స్థాయిలో బౌలింగ్ చేయడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా జోస్ అయితే ప్రతి బాల్ ను ఫోర్ లేదా సిక్సర్ కొట్టేందుకే ఆడుతున్నాడా అన్నట్టుగా కసి తీరా బాదాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు భారత బౌలర్లపై వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ గల్లి స్థాయి బౌలింగ్ తో సెమీస్ దాకా ఎలా వచ్చారు అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో “ఇండియా లాస్” అనేది ట్రెండింగ్లో ఉంది. ఈ ఓటమి తమకు బాగా కిక్ ఇచ్చిందని పాకిస్తాన్ అభిమానులు పేర్కొంటున్నారు.

భారత అభిమానుల కౌంటర్
భారత జట్టు అదృష్టం మీద ఆధారపడకుండా సెమిస్ చేరిందని.. ఇక్కడి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ చేరడం సెమీస్ చేరడం ఆ అదృష్టం కాకపోతే మరి ఏంటి అని మనవాళ్లు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ జట్టుకు నీతి జాతి అనేది ఉంటే నెదర్లాండ్ జట్టుకు కృతజ్ఞతలు చెప్పాలని హితవు పలుకుతున్నారు. ఇవాళ భారత్ పరిస్థితి బాగోలేక ఓడిపోయిందని.. టి20 వరల్డ్ కప్ మొదటి గెలిచింది తమ జట్టు అని గుర్తు చేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ నేపథ్యంలో దేశాల అభిమానుల మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వార్ జరుగుతున్నది.