India vs Sri Lanka 2nd Odi: రెండో వన్డేలోనూ భారత్ విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.. మొదటి వన్డేలో 69 పరుగుల తేడాతో శ్రీలంక పై ఘన విజయం సాధించిన భారత జట్టు… రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించేలా ముందడుగు వేసింది.. ఇందులో భాగంగా భారత బౌలింగ్ విభాగం సత్తా చాటింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. 29 పరుగుల వద్ద ఫెర్నాండో రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. నువానిడు ఫెర్నాండో, కుషాల్ మెండీస్.. కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కుల దీప్ యాదవ్ విడదీశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు రెచ్చిపోయారు.. శ్రీలంక భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా చూశారు.

మొదట గతి తప్పారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే అదే లయను భారత బౌలర్లు కొనసాగించలేకపోయారు.. ఇదే సమయంలో శ్రీలంక ఆటగాళ్లు స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఈ నేపథ్యంలో కులదీప్ యాదవ్ కుషాల్ మెండీస్ వికెట్ తీసి భారత శిబిరంలో ఆశలు చిగురింపజేశాడు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అతడికి అక్షర్ పటేల్ తోడు కావడంతో శ్రీలంక తడబడింది.. రెండు వికెట్లు కోల్పోయేటప్పటికి ఓవర్ కి 6 చొప్పున పరుగులు చేసిన శ్రీలంక ఆ తర్వాత ఎందుకో అదే జోరు కొనసాగించలేకపోయింది.

ఆదుకోని మిడిల్ ఆర్డర్
తొలి వన్డేలో ఓపెనర్లు విఫలమైనప్పటికీ… శ్రీలంక మిడిల్ ఆర్డర్ ధాటిగా ఆడింది. ఏకంగా 306 పరుగుల స్కోరు సాధించింది. కానీ రెండో వన్డేలో మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. టెయిల్ ఎండర్లు ఆ మాత్రం తెగువ చూపించకుంటే శ్రీలంక 150 లోపే చాప చుట్టేసేది. హసరంగ, వెల్లాలగే, కరుణ రత్న, రజిత మెరుపులు మెరిపించడంతో 215 పరుగులైనా చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్ మూడేసి వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. లంక జట్టులో నువినాడో ఫెర్నాండో 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటికే t20 సిరీస్ భారత్ గెలిచింది. మొదటి వన్డే కూడా భారత వశమైంది..ఈ మ్యాచ్ కూడా గెలిచి కప్ దక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.. అద్భుతం జరిగితే తప్ప ఈరోజు శ్రీలంక గెలిచే అవకాశాలు దాదాపుగా ఉండవు.