Best earning methods for Students: పెరుగుతున్న కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పోటీ పరీక్షల కోచింగ్ ఫీజులు విద్యార్థులపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలగకుండా ప్రతి నెలా కొంత పాకెట్ మనీ సంపాదించాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో కేవలం స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు, ఇంట్లో నుంచే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం పొందే అవకాశాలు విస్తరించాయి. అవేంటో చూద్దాం..
ఫ్రీలాన్సింగ్:
ఫ్రీలాన్సింగ్‌లో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇందులో పని చేసే సమయాన్ని విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. కాలేజీ లేదా చదువు పూర్తయ్యాక ఖాళీ సమయంలో పనులు పూర్తి చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా చాలా పనులకు పెద్ద డిగ్రీలు లేదా అనుభవం కూడా అవసరం ఉండదు. టైపింగ్ స్పీడ్, భాషపై పట్టు, కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది.ఫ్రీలాన్సింగ్ పనులను పొందేందుకు కొన్ని ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. Upwork, Freelancer India, Truelancer, Fiverr వంటి వెబ్‌సైట్లలో ఖాతా సృష్టించి తమ నైపుణ్యాలను నమోదు చేసుకోవచ్చు. పని ఇచ్చే కంపెనీలు లేదా వ్యక్తులు అక్కడే ప్రాజెక్టులను పోస్టు చేస్తారు. ఆసక్తి ఉన్న ఫ్రీలాన్సర్లు వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
డేటా ఎంట్రీ :
ప్రస్తుతం మార్కెట్లో డేటా ఎంట్రీ పనులకు మంచి డిమాండ్ ఉంది. ఎక్సెల్ షీట్లు అప్‌డేట్ చేయడం, PDF ఫైళ్లను Word డాక్యుమెంట్లుగా మార్చడం, ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, కంపెనీల రికార్డులను డిజిటల్ రూపంలో నమోదు చేయడం వంటి పనులు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పనులను రోజుకు కొన్ని గంటలు కేటాయించి పూర్తి చేస్తే నెలకు అదనపు ఆదాయం పొందవచ్చు.
ట్రాన్స్‌లేషన్ :
అలాగే ట్రాన్స్‌లేషన్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న రంగంగా మారాయి. ఇంగ్లీష్‌లో ఉన్న సమాచారం లేదా వ్యాసాలను తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయ కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో భాషపై పట్టు ఉన్న విద్యార్థులకు ఇవి మంచి అవకాశాలుగా మారుతున్నాయి.
కంటెంట్ రైటింగ్:
ఇక సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, కంటెంట్ రైటింగ్, వీడియో సబ్‌టైటిల్స్ తయారీ, ట్రాన్స్‌క్రిప్షన్ వంటి పనులు కూడా విద్యార్థులు ఇంటి నుంచే చేయగలిగేవే. యూట్యూబ్ ఛానెల్లు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు ఫ్రీలాన్సర్ల సహాయాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Fiverr :
ఈ ప్లాట్‌ఫారమ్‌లో చిన్నచిన్న సేవలను ‘గిగ్స్’ రూపంలో విక్రయించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు టైపింగ్, ట్రాన్స్‌లేషన్, డేటా ఎంట్రీ, పోస్టర్ డిజైన్, సోషల్ మీడియా పోస్టుల తయారీ వంటి సేవలను అందించవచ్చు. ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలైనా, అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.
ఎస్క్రో:
ఫ్రీలాన్సింగ్‌లో చెల్లింపుల భద్రత కోసం చాలా ప్లాట్‌ఫారమ్‌లు “ఎస్క్రో” (Escrow) వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇందులో పని ఇచ్చే వ్యక్తి ముందుగానే డబ్బును ప్లాట్‌ఫారమ్ వద్ద జమ చేస్తాడు. ఫ్రీలాన్సర్ పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ డబ్బు విడుదల అవుతుంది. దీంతో మోసాలకు అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా కొత్తగా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించే విద్యార్థులకు ఇది భద్రత కల్పిస్తుంది.
అయితే ఆన్‌లైన్ ఉద్యోగాల విషయంలో అప్రమత్తత కూడా చాలా అవసరం. ‘రోజుకు రూ. 5,000 సంపాదించండి’, ‘ఎటువంటి పని లేకుండా భారీ ఆదాయం’ వంటి ప్రకటనలను నమ్మకూడదు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు లేదా డిపాజిట్ అడిగే సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిజమైన ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లు సాధారణంగా ఉద్యోగం కోసం డబ్బు అడగవు.
