Amazon Employees Layoffs: ఆ కంపెనీ చేయని వ్యాపారం అంటూ లేదు. ఏటా ఆదాయం లక్షల కోట్లలో ఉంటుంది. ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ఉంటారు. అలాంటి కంపెనీ 18 వేల మందిని తొలగించడం అంటే పెద్ద విశేషమే. కానీ అసలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేని కంపెనీ అది.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదించి, ఇతర రంగాల్లో కూడా విస్తరిస్తూ లాభాలను ఆర్జిస్తున్న ఆ కంపెనీ… ఇప్పుడు పొదుపు చర్యలు పాటించడం ప్రపంచ వ్యాపార వర్గాలను ఆలోచింపచేస్తోంది.

పాపం ఉద్యోగులు
అమెజాన్.. భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. లక్షల కోట్ల ఆదాయాన్ని ఏటా ఆర్జిస్తోంది. అయినప్పటికీ ఆర్థిక మాంద్యం అనే బూచిని చూపి ఉద్యోగులను బలవంతంగా బయటకు గెంటేస్తోంది.. ఏకంగా లే ఆఫ్ ప్రకటించి… 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇక ఈ లే ఆఫ్ కేవలం యూరప్ దేశాల్లోనే అమలవుతోంది. కానీ ఈ బూచికి భారతీయ మూలాలు ఉన్న ఎంతోమంది ఉద్యోగులు బాధితులుగా మారుతున్నారు.
నవంబర్లో పదివేల మంది
గత ఏడాది నవంబర్లో పదివేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.. అమెజాన్ చరిత్రలో అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది.. ఏకంగా 18 వేల మందికి ఉద్వాసన లేఖలు సిద్ధం చేసింది.. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సి ఉన్నప్పటికీ.. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి లీక్ చేశారు.. దీంతో కంపెనీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.. ఆ కంపెనీ సీఈవో అండీ జస్సీ ప్రకటన చేశారు.

ఇతర కంపెనీలపై..
అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగించడం అంటే ఆ ప్రభావం ఇతర చిన్న సంస్థలపై పడుతుంది.. అవి కూడా అమెజాన్ బాటనే అనుసరిస్తాయి. ఆర్థిక మాంద్యం బూచి చూపి ఉద్యోగుల మెడపై కత్తి పెడతాయి.. లేకుంటే జీతాల పెంపుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయి. రెండు కూడా ఉద్యోగులకు నష్టాన్ని కలిగించేవే. ఉద్యోగుల కష్టంతో అంతకంతకు ఎదిగిన కంపెనీలు తీరా కష్టకాలంలో వారిని ఇళ్లకు పంపిస్తున్నాయి. ఒకప్పుడు లక్షల్లో జీతాలు, వారంలో రెండు రోజులు సెలవులు, బోనస్ లతో సుఖమయమైన జీవితాన్ని గడిపిన ఐటీ ఉద్యోగులు…ఇప్పుడు పింక్ స్లిప్ లతో ఉద్వాసనకు గురి కావడం నిజంగా బాధాకరం.