Selling Old Car: మీ పాత కారును అమ్మాలని చూస్తున్నారా అయితే కారు అమ్మేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి రేటు రావాలంటే, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి. కారు అమ్మేటప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో పాత కారును అమ్మేటప్పుడు ముఖ్యంగా మూడు రకాల డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. కారుకు సంబంధించిన డాక్యుమెంట్లు, మీ ఐడెంటిటీ డాక్యుమెంట్లు, ఆర్‌టీఓ డాక్యుమెంట్లు.
కారుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు
* రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్: ఇది కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలోకెల్లా చాలా ముఖ్యమైంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ఏ వెహికల్ అమ్మాలన్నీ ఈ డాక్యుమెంట్ తప్పనిసరి. కారు మీ పేరు మీద రిజిస్టర్ అయిందని, దానికి చట్టపరమైన యజమాని మీరేనని ఆర్‌సీ కన్ఫాం చేస్తుంది. ఒకవేళ మీ ఆర్‌సీ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆపై ఫారం 26 నింపి డూప్లికేట్ కాపీని తీసుకోవచ్చు.
* పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్: మీ కారు వదులుతున్న పొగ ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని.. అది కాలుష్యానికి కారణం కాదని ఈ సర్టిఫికేట్ చూపిస్తుంది. దగ్గర్లోని పెట్రోల్ బంకుల్లో, ఎమిషన్ చెక్ చేసే చోట మీ వాహనానికి పీయూసీ సర్టిఫికేట్ పొందవచ్చు.
* కారు ఇన్సురెన్స్ : కారు ఇన్సురెన్స్ లేకుండా ఆర్‌టీఓ ఓనర్ ట్రాన్సఫర్ ప్రాసెస్ కంప్లీట్ చేయరు. కాబట్టి, కారు అమ్మేటప్పుడు కచ్చితంగా వ్యాలిడిటీ అయ్యే కారు ఇన్సురెన్స్ పాలసీ మీ దగ్గర ఉండాలి.
మీ ఐడెంటింటీ డాక్యుమెంట్లు
* పాన్ కార్డ్ : పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లలో ఒకటి, ఇది కచ్చితంగా మీ దగ్గర ఉండాలి.
* అడ్రస్ ప్రూఫ్ : మీరు ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ ఇదేనని ఈ డాక్యుమెంట్ రుజువు చేస్తుంది. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మీ అడ్రస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అవసరం. మీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఏదైనా ఇతర గవర్నమెంట్ డాక్యుమెంట్ ను అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో, కరెంటు బిల్లును కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఒప్పుకుంటారు.
Also Read: ఈవీలను 100% ఛార్జ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఆర్‌టీఓ డాక్యుమెంట్లు
* ఫారం 28 : ఇది ఎన్‌ఓసీ. వెహికల్ ఓనర్ ట్రాన్సఫర్ కి ఎటువంటి అభ్యంతరం లేదని, మీ వెహికల్ రికార్డులు సరిగా ఉన్నాయని ఇది చూపిస్తుంది.
* ఫారం 29 : వాహనాన్ని వేరొకరికి అమ్మినట్లు ఆర్‌టీఓకు తెలియజేయడానికి ఈ ఫారంను ఉపయోగిస్తారు. కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కొనేవాళ్లకు ట్రాన్సఫర్ అయ్యాయని రుజువు కోసం ఈ ఫారం 29 రెండు కాపీలను సమర్పించాలి.
* ఫారం 30 : ఫారం 29 సమర్పించిన తర్వాత, కారు అమ్ముతున్న వ్యక్తి ఫారం 30 నింపి, వెహికల్ ట్రాన్సఫర్ వెంటనే మొదలు పెట్టాలని ఆర్‌టీఓకు తెలియజేయాలి.
ఎక్స్ ట్రా డాక్యుమెంట్లు
పైన చెప్పిన డాక్యుమెంట్లతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు ఉంచుకోవాలి.
* వాహనం బిల్లు : కారును కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన ఒరిజినల్ బిల్లు.
* ఓనర్ మాన్యువల్ : కారుకు సంబంధించిన కస్టమర్ మాన్యువల్.
* సర్వీస్ హిస్టరీ రికార్డ్ : కారు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించిన రికార్డులు.
ఈ డాక్యుమెంట్లు కొనుగోలు చేసే వ్యక్తికి మీ వెహికల్ మీద మరింత నమ్మకాన్ని పెంచుతాయి. దీనివల్ల మీకు కారుకు మంచి ధర లభించే అవకాశం ఉంటుంది.