
KL Rahul’s vice captaincy : కొంతకాలంగా ఫాం కోల్పోయి జట్టులో స్థానంలో నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నాడు టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 38 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని బీసీసీఐ మిగిలిన రెండు టెస్టులకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆటగాడిగా మాత్రమే సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ఇదే సమయంలో ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ని తుది జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ని వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దీనిని చిన్న విషయంగా వ్యాఖ్యానించారు.
అది పెద్ద విషయమా?
‘జట్టులోని మొత్తం 17 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది. ప్రతిభావంతులైన వారికి జట్టు మద్దతు ఇస్తుంది. వైస్ కెప్టెన్సీని తొలగించడం అనేది పెద్ద విషయం కాదు’ అని రోహిత్ శర్మ అన్నారు. కేఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేరు. అందుకే రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా చేశారు. అని పేర్కొన్నారు. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. మూడో టెస్టులోనూ కంగారులను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకోవాలని ఆశిస్తోందని తెలిపారు.
జట్టులో స్థానంపై సందిగ్ధం..
రోహిత్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో పేలవ ప్రదర్శనలో కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌కు మూడో టెస్టులో తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న సందిగ్ధం కూడా నెలకొంది. ఇదిలా ఉంటే మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లకు కొత్త వైస్ కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కొంతమంది రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది మరికొన్ని పేర్లను తెరమీదకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టుకు వైస్ కెప్టెన్ అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో మాత్రం వైస్ కెప్టెన్ తప్పనిసరి అని తెలిపారు.
మొత్తంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తాజాగా వైస్ కెప్టెన్సీ నుంచి రాహుల్‌ను తప్పించడాన్ని లైటగా తీసుకున్నారు. అంటే ఆయన కూడా స్వదేశంలో వైస్ కెప్టెన్ అవసరం లేదన్న భావనలోనే ఉన్నట్లు అర్థమవుతోంది.