IPL 2022: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓడి సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 5 సార్లు ఛాంపియన్ ఇలా ఓడిపోవడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ ఓటములకు ఆ జట్టు బౌలింగ్ యూనిట్ బలహీనంగా ఉండడం ప్రధాన కారణంగా పలువురు చెబుతున్నారు. ఆ జట్టులో జస్ప్రీత్ బుమ్రా మినహా మరో సరైన బౌలర్ లేడని అంటున్నారు. మొత్తానికి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం అభిమానులకు మరింత నిరీక్షణ తప్పడం లేదు.

ఇక బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), మయాంక్ అగర్వాల్ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
అయితే వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడినా.. ఆ అభిమానులు ప్లే ఆఫ్స్‌పై ఆశలు వదులు కోవడం లేదు. గతంలో కూడా ముంబై వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడి తర్వాత సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిందని గుర్తు చేస్తున్నారు. 2014 సీజన్‌లో ముంబై ఇలాంటి పరిస్థితుల నుంచి తేరుకొని ప్లే ఆఫ్స్ చేరింది.
Also Read: ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఎందుకు సిద్ధ పడ్డాడు.. విఫలమైతే ప్లాన్ బీ ఉందట
ఆ సీజన్‌లో ముంబై ఇలానే వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడింది.. ఇంకేం పుంజుకొంటుందిలే అనుకుని ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్ అయ్యాయి.. ఇదే అదనుగా చెన్నై, కోల్‌కతా మినహా ఇతర జట్లపై వరుసపెట్టి విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్ చేరుకుంది రోహిత్ సేన. ఇప్పుడు కూడా మరోసారి ముంబైకి అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.
అయితే అప్పుడు 8 జట్లు మాత్రమే పాల్గొన్నాయి కాబట్టి ఏడు విజయాలతో ముంబై ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ ఈ సారి జట్ల సంఖ్య పది చేరడంతో ప్లే ఆఫ్స్ చేరడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుండగా ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 9 మ్యాచ్‌లైనా గెలవాలి. లేకుంటే ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. 9 మ్యాచ్‌లు గెలవడమే కాదు.. మెరుగైన రన్‌రేట్ కూడా మెయింటేన్ చేయాలి.
Also Read: ఆటతోనే సమాధానం చెప్తున్న పాండ్యా.. దానికోసమే విజృంభిస్తున్నాడా