Raw Onion Health Benefits: ప్రతి వంటింట్లో ఉల్లిపాయలు ఉండాల్సిందే. కూరలో ఉల్లిపాయ లేకపోతే నోటిలో ముద్ద దిగడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందుకే కూరల్లో వాటిని వాడుతుంటారు. అయితే కూరల్లో కాకుండా ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో పచ్చి ఉల్లిపాయలను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఏవైనా ఇన్ఫెక్షన్‌లు వచ్చినా వెంటనే తగ్గిపోతాయి. అంత ఇమ్యునిటీ పవర్‌ను మన శరీరానికి పచ్చి ఉల్లిపాయలు అందిస్తాయి. ఇవి జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. పచ్చి ఉల్లిపాయలలో మొక్కల ఆధారిత రసాయనాలు ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌లు, ఖనిజాలు శరీరంలోని అనేక భాగాలకు ఔషధ గుణాలను అందిస్తాయి.
వేసవిలో ఉల్లిపాయలను తీసుకుంటే శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే చర్మంపై పొక్కులు, దద్దుర్లు వస్తాయి. వీటిని నయం చేయాలంటే ఉల్లిపాయలను తినాల్సిందే. వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు వ్యాధులు కూడా తగ్గుతాయి. అంతేకాదు పచ్చి ఉల్లిపాయలు డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.

ఉల్లిపాయల్లో విటమిన్ ఎ, బి6, బి-కాంప్లెక్స్ ,విటమిన్-సి పుష్కలంగా లభిస్తాయి. పూర్వకాలంలో ఉల్లిపాయలను నోటిపూత, గుండె సంబంధిత సమస్యలు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించేవారు. వేసవిలో ప్రజలు తరచుగా కడుపు సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉల్లిపాయ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తెల్ల ఉల్లిపాయలో ఉండే క్వెర్సిటిన్, సల్ఫర్ వంటి కొన్ని మూలకాలు యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలోనూ సహాయపడతాయి.