Binge Eating: మనసుకు నచ్చని వాతావరణం ఉన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ఇలాంటి సమయంలో ఒక్కోసారి మనసు అదుపులో లేకుండా పోతుంది. అయితే డిప్రెషన్ అనేది కేవలం మానసిక పరిస్థితిని మాత్రమే కాదు. మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక ఆరోగ్యాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేసే సమస్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్న కొందరు ఆకలి పూర్తిగా కోల్పోతే, మరికొందరు మాత్రం ఎక్కువగా తింటూ ఉంటారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?
ఒక వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఆకలి, మానసిక స్థితి, శక్తి స్థాయిలు మారిపోతాయి. కొందరికి అసలు తినాలనిపించకపోగా, మరికొందరు తరచూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలపై ఆసక్తి పెరగడం సాధారణంగా కనిపిస్తుంది.
డిప్రెషన్‌లో ఉన్నప్పుడు చాలామంది ఆహారాన్ని ఓదార్పుగా భావిస్తారు. తినడం వల్ల కొద్దిసేపు మెదడులో ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఉపశమనం తాత్కాలికమే. మళ్లీ అదే బాధ, ఒత్తిడి రావడంతో తిరిగి ఎక్కువగా తినే అలవాటు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎమోషనల్ ఈటింగ్ అని పిలుస్తారు. తరచూ అతిగా తినడం కొనసాగితే అది క్రమంగా బింజ్ ఈటింగ్ డిజార్డర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఒకేసారి అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం, తిన్న తర్వాత అపరాధ భావన కలగడం, అయినా మళ్లీ అదే అలవాటు కొనసాగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
ప్రతి ఒక్కరిలో డిప్రెషన్ ఒకే విధంగా ఉండదు. కొందరిలో ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందక బరువు తగ్గడం, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.
డిప్రెషన్‌ను కేవలం ఆహారం ద్వారా నియంత్రించడం సాధ్యం కాదు. జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్‌కు కారణమైన ఒత్తిడి, వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం కనుగొనడం చాలా అవసరం.
