Homeలైఫ్ స్టైల్Personal Finance Tips: ప్రతీ నెల జీతం రాగానే అయిపోతుందా.. ఇలా చేస్తే మిగిలిన డబ్బును...

Personal Finance Tips: ప్రతీ నెల జీతం రాగానే అయిపోతుందా.. ఇలా చేస్తే మిగిలిన డబ్బును లెక్కపెడతారు..

Personal Finance Tips: ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల కారణంగా చాలా మంది ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు మిగలడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి తక్కువ ఆదాయం మాత్రమే కారణం కాదు. చాలా సందర్భాల్లో ఆర్థిక ప్రణాళిక లేకపోవడం కూడా కారణం అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. వచ్చిన డబ్బును సరైన విధంగా విభజించకపోవడం.. ముఖ్యంగా ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా జీతం, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు అన్నీ నిర్వహించడం వల్ల డబ్బు ప్రవాహంపై స్పష్టత ఉండడ లేదని తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ప్లాన్లు వేసుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. అదెలాగంటే?

ఒకే అకౌంట్ తో సమస్యలు:
చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు తమ ఆదాయం మొత్తం ఒకే బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయించుకుని అదే అకౌంట్ నుంచి అన్ని ఖర్చులు చేస్తుంటారు. దీంతో నెలలో ఎంత అవసరమైన ఖర్చు? ఎంత అనవసర ఖర్చు? అనే విషయాలను గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాకుండా సేవింగ్స్ కోసం ఉంచిన డబ్బును కూడా అవసరం పేరుతో ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

వేర్వేరు అవసరాలకు వేర్వేరు అకౌంట్లు:
ఆర్థిక నిపుణులు వ్యక్తిగత ఫైనాన్స్‌ను సులభంగా నిర్వహించడానికి కనీసం రెండు నుంచి నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. మొదటి అకౌంట్‌ను ఆదాయం కోసం, రెండో అకౌంట్‌ను రోజువారీ ఖర్చుల కోసం, మూడో అకౌంట్‌ను పెట్టుబడుల కోసం, నాలుగో అకౌంట్‌ను అత్యవసర నిధి (Emergency Fund) కోసం ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా అర్థమవుతుంది.

ఆదాయం అకౌంట్ ప్రత్యేకత:
జీతం లేదా వ్యాపార ఆదాయం వచ్చే అకౌంట్‌ను కేవలం డబ్బు స్వీకరించడానికి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. ఆదాయం వచ్చిన వెంటనే ముందుగా నిర్ణయించుకున్న మొత్తాన్ని ఖర్చుల అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లకు బదిలీ చేయాలి. ఇలా చేయడం వల్ల అవసరమైన కేటాయింపులు ముందుగానే పూర్తవుతాయి.

ఖర్చుల అకౌంట్ ఎందుకు అవసరం?
ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, కిరాణా, ప్రయాణ ఖర్చులు, EMIలు వంటి నెలవారీ వ్యయాల కోసం ప్రత్యేక అకౌంట్ ఉంటే ఖర్చులను నియంత్రించడం సులభమవుతుంది. ఒక నెలకు ఎంత బడ్జెట్ కేటాయించారో అదే మొత్తాన్ని ఈ అకౌంట్‌లో ఉంచడం ద్వారా అదనపు ఖర్చులను తగ్గించుకోవచ్చు.

పెట్టుబడుల కోసం ప్రత్యేక అకౌంట్:
మ్యూచువల్ ఫండ్లు, స్టాక్స్, రికరింగ్ డిపాజిట్లు, SIPలు వంటి పెట్టుబడుల కోసం ప్రత్యేక అకౌంట్ ఉంటే పెట్టుబడుల క్రమశిక్షణ పెరుగుతుంది. సాధారణ ఖర్చుల కోసం ఈ డబ్బును ఉపయోగించే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్ ప్రాముఖ్యత:
అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే నిధిని ప్రత్యేక అకౌంట్‌లో ఉంచాలి. సాధారణంగా 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని ఈ అకౌంట్‌లో నిల్వ ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించకూడదు.

ఎక్కువ వడ్డీ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్‌ను ఎంచుకోవాలి
సేవింగ్స్ కోసం ఉపయోగించే అకౌంట్‌ను ఎంపిక చేసేటప్పుడు వడ్డీ రేట్లను కూడా పరిశీలించాలి. కొన్ని బ్యాంకులు సాధారణ సేవింగ్స్ అకౌంట్ల కంటే ఎక్కువ వడ్డీ అందిస్తుంటాయి. అలాంటి అకౌంట్లలో ఎమర్జెన్సీ ఫండ్ లేదా స్వల్పకాలిక సేవింగ్స్‌ను ఉంచడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular