Mental Health tips : ఒక పని పూర్తి చేయడానికి సమయస్ఫూర్తితో పాటు భయం కూడా చాలా అవసరం. ఎందుకంటే భయం కారణంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ సమయంలో ఆలోచనలు విపరీతంగా వస్తాయి. ఒక్కోసారి సరైన ఆలోచనకు కూడా భయం కారణమవుతుంది. అయితే ఏదైనా మితిమీరితే విషయమే అన్నట్లు.. భయం కూడా ఎక్కువగా ఉంటే ఏ పని పూర్తి చేయలేరు. ఇంటర్వ్యూకు వెళ్లేవారు ఎక్కువ భయంతో కూడుకొని ఉంటే అందులో విజయం సాధించలేరు. డ్రైవింగ్ చేసేవారు బాగా భయపడితే వాహనాన్ని సరిగ్గా నడపలేరు. కానీ తమకు భయం లేదు అని అనుకుంటూనే కొందరు లోలోపల ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటివారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏం చేయాలి?
Also Read : అర్ధరాత్రి ఆ సమయంలో నిద్రపోతున్నారా?
కొందరు కొత్తగా జాబ్ లో జాయిన్ కావడానికి రెడీ అవుతారు. అయితే ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. అంతా కొత్త మనసులు.. కొత్త బాస్.. వీరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా మాట్లాడాలి? అని ముందే ఊహించుకుంటూ భయపడుతూ ఉంటారు. ఇది వారిలో అనుకోకుండా వచ్చినట్లయితే.. కొత్త ఉద్యోగంలో చేరే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని గడపాలి. అందుకోసం ఒక గంట ముందు పార్కులో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. పచ్చని చెట్ల మధ్య కాసేపు కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గి పనిపై శ్రద్ధ పెరుగుతుంది.
చాలామందికి ఖాళీగా ఉన్న సమయంలో ఏవేవో చెడు ఆలోచనలు వస్తుంటాయి. తమ భవిష్యత్తు ఏమవుతుందో? ఎలా ఉంటుందో అని? నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు రోజుకు కనీసం అరగంట పాటు అయినా వ్యాయామం చేయడం మంచిది. అలాగే ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలాంటివారు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆందోళన కాస్త తగ్గుతుంది.
ఉద్యోగం చేస్తున్న వారు ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తుంటారు. అయితే ఈ విషయం బాస్ కు పూర్తిగా తెలియకుండానే తీవ్రమైన ఆందోళన చెందుతారు. సహజంగా ఇది అందరిలోనూ ఉంటుంది. కానీ కొందరిలో ఆందోళనలతో చెమటలు పడుతూ ఉంటాయి. ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా ఉంటుంది. ఇలా ఎక్కువగా బాధపడేవారు సాయంత్రం మూడు తర్వాత కెఫిన్ తో కూడిన పానీయాలు తీసుకోకుండా ఉండాలి. ఇవి మరింత ఆందోళన గురిచేసి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి ఎక్కువగా చెమట వచ్చేలా చేస్తాయి.
ఎక్కువమంది తమ ఆందోళనలు తగ్గించుకోవడానికి మద్యం, ధూమపానం వంటివి అలవాటుగా మార్చుకుంటారు. వీటివల్ల తాత్కాలికంగా ఆందోళన తగ్గుతుంది. కానీ ఆ తర్వాత వ్యసనాలుగా మారి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అందువల్ల వీటి జోలికి పోకుండా.. వీటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సాధారణ డ్రింక్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు ఆందోళన కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యసనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక భారం మీద పడి మరింతగా ఆందోళనకు గురవుతారు.